Arvind Kejriwal : మెట్రో రైళ్లలో విద్యార్థులకు 50 శాతం రాయితీ - ఎన్నికలకు ముందు ప్రధానికి లేఖ రాసిన కేజ్రీవాల్
Delhi Elections 2025: ఢిల్లీలోని విద్యార్థులకు సాధారణ ఛార్జీల్లో సగం చొప్పున మెట్రో రైడ్‌లను అందించాలన్న తన ప్రతిపాదనకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

Arvind Kejriwal : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలతో పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ రాజధాని పరిధీలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే విద్యార్ధులకు టిక్కెట్ ధరపై 50 శాతం రాయితీకి ఆమోదం తెలపాలని కోరారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ ఈ ప్రతిపాదనను అమలు చేయడంలో వచ్చే నష్టాలను సైతం నిర్వహించాలని చెప్పారు.
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ
విద్యా ప్రయోజనాల కోసం రోజువారీగా ఢిల్లీ మెట్రో ద్వారా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రయాణిస్తారని పేర్కొంటూ, కేజ్రీవాల్ విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 50% రాయితీని అందించాలని ప్రతిపాదించారు. “ఢిల్లీలోని పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంపై నేను ఈ లేఖ రాస్తున్నాను. ఢిల్లీలోని పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ విద్యాసంస్థలకు, వారి రోజువారీ ప్రయాణానికి మెట్రోపై ఎక్కువగా ఆధారపడుతున్నారు" అని కేజ్రీవాల్ చెప్పారు. “విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, విద్యార్థులకు మెట్రో ఛార్జీలపై 50% రాయితీని అందించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమానమైన (50:50) నిధులతో కూడిన జాయింట్ వెంచర్. కాబట్టి, ఈ రాయితీ ధరను ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ సమానంగా పంచుకోవాలి” అని కేజ్రీవాల్ చెప్పారు. ఈ లేఖపై ప్రధాని మోదీ ఇప్పటివరకైతే స్పందించలేదు.
AAP राष्ट्रीय संयोजक @ArvindKejriwal जी ने Students को मेट्रो किराए में 50% छूट देने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी को लिखा पत्र✍️
— AAP (@AamAadmiParty) January 17, 2025
👉 पत्र में केजरीवाल जी ने कहा - दिल्ली और केंद्र सरकार मिलकर इससे होने वाले खर्च को वहन करें
👉 दिल्ली में महिलाओं की बस यात्रा मुफ्त करने के… pic.twitter.com/LgtOh6iS5l
విద్యార్థులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ
బస్సుల్లో విద్యార్థులకు ప్రయాణాన్ని పూర్తిగా ఉచితం చేయాలని యోచిస్తోందని, ఈ ప్రతిపాదనకు ప్రధాని అంగీకరిస్తారని తాను ఆశిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని బస్సుల్లో మహిళా ప్రయాణీకులకు ఫ్రీ జర్నీకి అనుమతిస్తుండగా.. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం దీనిని విద్యార్థులకు సైతం ఉచితంగా అందించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున, ఎన్నికలకు ముందు నిర్ణయాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ మళ్లీ ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది.
అంతకుముందు కూడా అరవింద్ కేజ్రీవాల్.. ప్రధానికి లేఖ రాశారు. జాట్ కమ్యూనిటీని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) జాబితాలో చేర్చాలని, తద్వారా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పొందడం సులభతరం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి అధికారం ఛేజిక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రానికి వరస లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష - ఇక జైల్లోనే పాక్ మాజీ అధ్యక్షుడి జీవితం !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

