Karnataka Assembly Elections బరిలో మాజీ మంత్రి - నియోజకవర్గంలో అడుగు పెట్టొదంటూ కోర్టు తీర్పు, ఏమైందంటే?
Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రికి స్థానిక కోర్టు అదిరిపోయే షాక్ ఇచ్చింది. తన నియోజకవర్గానికి వెళ్లడాన్ని నిషేధించింది.
Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికల సంగ్రమానికి సమయం ఆసన్నమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని ఓ కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. ఓ అభ్యర్థికి సంబంధించిన కేసులో తీర్పు ఇచ్చిన కోర్టు.. సదరు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీళ్లేదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కోర్టు ఆ అభ్యర్థిని ఎందుకు తన నియోజకవర్గానికి వెళ్లనివ్వడం లేదు అనే వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ధార్వాడ్ నియోజకవర్గంలో నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు వినయ్ కులకర్ణి. ఆయన మాజీ మంత్రి కూడా. అయితే తను ఓ కేసులో నిందితుడుగా ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ గౌడ హత్య కేసులో నిందితుడు వినయ్ కులకర్ణి. అందుకే ధర్మాసనం వినయ్ కులకర్ణి ధార్వాడ్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేదు.
వినయ్ కులకర్ణి విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ హత్య కేసులో వినయ్ కులకర్ణి నిందితుడు కావడంతో ఆయన ధార్వాడ్ లోకి ప్రవేశించకుండా దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ధార్వాడ్ ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గత వారం మరోసారి అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈమేరకు స్థానిక కోర్టులో అప్పీలు చేసుకోవాలని సూచించింది. దీంతో వినయ్ కులకర్ణి.. కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. తనను ధార్వాడ్ నియోజకవర్గానికి అనుమతించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వినయ్ కులకర్ణి అప్పీలును కొట్టేసింది.
ధార్వాడ్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. 2016లో జిమ్ వెలుపల బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ గౌడను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో విచారణ తర్వాత మాజీ మంత్రి వినయ్ కులకర్ణి పేరును కూడా చేర్చారు పోలీసులు. ఈ కేసులో వినయ్ కులకర్ణి అరెస్టు కూడా అయ్యారు. కొన్ని రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.
అంతకు ముందు వినయ్ కులకర్ణి.. శిగ్గావ్ నుండి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై పోటీ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆఖరికి వినయ్ కులకర్ణి ధార్వాడ్ నుండి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. అయితే యోగేశ్ హత్య కేసులో వినయ్ కులకర్ణి నిందితుడిగా ఉండటం వల్ల ఆయనను ధార్వాడ్ నియోజకవర్గంలో ప్రవేశించేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. కర్ణాటక శాసనసభకు మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఫలితాలు వస్తాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. జేడీఎస్ పార్టీ నాయకులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి చేరికలు, ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి.