Chandrayan-3: చంద్రునివైపు దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఇసుక రేణువంత సైజులో కనిపించిన స్పేస్‌క్రాఫ్ట్
Chandrayan-3: చంద్రుని వైపు దూసుకెళ్తున్న చంద్రయాన్-3 మొదటిసారిగా టెలిస్కోప్ కు కనిపించింది.
Chandrayan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతోంది. మూడ్రోజుల క్రితం ఐదో దశను పూర్తి చేసుకుంది. భూగురుత్వాకర్షణ పరిధి దాటి ప్రస్తుతం చంద్రునివైపు వేగంగా దూసుకెళ్తుంది. తదుపరి చేపట్టే దశలు అన్నీ చంద్రయాన్-3 ప్రయోగానికి కీలకమే అని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1, 2023 నిర్దేశించిన ప్రకారం చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించనుంది. అయితే తాజాగా చంద్రయాన్-3 టెలిస్కోప్ కు చిక్కింది. ఇటలీలోని మాన్సియానో లో ఉన్న వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్టు, అంతరిక్షంలో చంద్రుని వైపు వేగంగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3ని కనిపెట్టింది. విశాల విశ్వంలో చంద్రయాన్-3 ఇసుక రేణువంత కనిపిస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఈ మిషన్ లో ఇది కీలకమైన దశగా ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ దశలో చంద్రయాన్-3 చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోని కక్ష్యలోకి చేరుతుంది. క్రమంగా ఈ కక్ష్య పరిధిని కుదించుకుంటూ చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. 1,27,609 కి.మీ x 236 కి.మీ కక్ష్యను చేరుకుని క్రమంగా చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. అలా ఆగస్టు చివరి నాటికి చంద్రునికి 30 కిలోమీటర్ల దగ్గరి వరకు వెళ్తుంది. ఆ సమయానికి చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అసలు సిసలు పరీక్ష ప్రారంభం అవుతుంది. చంద్రయాన్-3 రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికబద్ధంగా జరిగితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గో దేశంగా భారత్ నిలవనుంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది.
We're thrilled to see #Chandrayan3 (@isro) observed by @astro_agn at ROTUZ (Panoptes-4) telescope (J. Gil Institute of Astronomy University of Zielona Góra), operated by @sybilla_tech . Trajectory via @coastal8049 with STRF by @cgbassa and members of the @SatNOGS . Godspeed! pic.twitter.com/8ifW94lOJQ
— Sybilla Technologies (@sybilla_tech) July 25, 2023
నాలుగు లక్షల కిలోమీటర్ల ప్రయాణం
చంద్రయాన్ 3ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి Launch Vehicle Mark 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. బరువు 3,921 కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది.
ల్యాండర్, రోవర్ మాడ్యూల్ వేరువేరుగా ఉన్న ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి సౌత్ పోల్ కి సమీపంలో ల్యాండ్ అవ్వనుంది. ప్రపొల్షన్ మాడ్యూల్ భూమి చుట్టూ పలుసార్లు తిరిగి చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడిపై గ్రావిటీకి తగ్గట్టుగా మాడ్యూల్ మెల్లగా కిందకు దిగుతుంది. ల్యాండర్ విడిపోతుంది. లాంఛ్ అయినప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల తరవాత చంద్రుడిపై మాడ్యూల్ దిగుతుంది.
తక్కువ ఖర్చుతో ప్రయోగం
చైనా, రష్యాలు జంబో రాకెట్లను ఉపయోగించి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించాయి. చైనా, అమెరికా దాదాపు రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా.. ఇస్రో మాత్రం రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లతోనే ప్రయోగం చేపడుతోంది. చంద్రుడి కక్ష్య వరకు వెళ్లే శక్తివంతమైన రాకెట్ సైతం ఇస్రో వద్ద లేకపోయినా క్లిష్టమైన ప్రక్రియలో ప్రయోగం చేపట్టింది. భారత్ సత్తా ప్రపంచమంతా చాటేలా ప్రయోగం చేసింది.