Nuclear War: భయంతో అణుయుద్ధ బెదిరింపులు- భారత్ దాడి చేస్తే పాకిస్థాన్ తట్టుకోగలదా?
Nuclear War: భారత్ దాడి చేస్తే అణుయుద్దం వస్తుందని పాకిస్థాన్ బెదిరిస్తోంది. కానీ నిజంగానే పాకిస్థాన్ వద్ద అంత శక్తి ఉందా?

India VS Pakistan: పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులను దారుణంగా హత్య చేసిన విధానానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉరి, పుల్వామా, ఇప్పుడు పహల్గాం, అన్ని దాడుల‌్లోనూ పాకిస్తాన్ కనెక్షన్ బయటపడింది. చాలా కాలంగా అది ఉగ్రవాద సంస్థలకు నిలయంగా ఉంది. దీని కారణంగానే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను కుదించేసింది. వీసాలను నిషేధించింది. పాకిస్థానులను బహిష్కరించింది. సింధు జల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. హై కమిషన్‌లో సిబ్బందిని తగ్గించడం, అటారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి అనేక చర్యలను భారతదేశం తీసుకుంది.
భారతదేశ చర్యతో పాకిస్తాన్ తీవ్రంగా భయపడుతోంది. ఈ ఆందోళన కారణంగా పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాతో మాట్లాడుతున్నారు, మరికొన్నిసార్లు తన స్నేహపూర్వక దేశాల నుంచి సహాయం కోరుతున్నారు. ఇంతేకాదు, పాక్ మంత్రులు రోజూ వింతైన ప్రకటనలు చేస్తున్నారు. అణు యుద్ధం చేస్తామంటూ మమేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నార. ఈ ప్రకటనల్లో వారి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు యుద్ధం గురించి మాట్లాడుతారు, మరికొన్నిసార్లు బెదిరిస్తున్నారు. అయితే, అణుయుద్ధం విషయంలో భారతదేశం కంటే పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది. అది ఏదైనా చర్య తీసుకుంటే .. భారతదేశం ప్రతిస్పందించినట్లయితే, పాకిస్తాన్‌కు ఏమవుతుందో కలలో కూడా ఊహించలేదు.
భారతదేశం వద్ద 180 అణ్వాయుధాలు, పాకిస్తాన్ వద్ద ఎన్ని?
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ 2025 నివేదికలో రెండు దేశాల అణు శక్తి వివరాల గురించి తెలిపింది. ఎవరి వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయో వివరించింది. ఆ నివేదిక ప్రకారం భారతదేశం వద్ద 180 అణ్వాయుధాలు ఉన్నాయి, అయితే పాకిస్తాన్ వద్ద కేవలం 172 ఆయుధాలు ఉన్నాయి. ఎయిర్, సీ ఎక్క డ చూసుకున్నా భారత్‌దే పైచేయి. పాకిస్థాన్ ఏదైనా చర్య తీసుకుంటే, అది చాలా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, దాని నుంచి కోలుకోవడానికి దశాబ్ధాలు పడుతుంది.
ఎయిర్ లాంచ్డ్ క్రూయెజ్‌లో పాకిస్తాన్ కంటే భారత్ అణు శక్తి ఎంత ఎక్కువ?
ఎయిర్ డెలివర్డ్ వెపన్ అంటే గాలి ద్వారా దాడి చేసే అణు శక్తి గురించి మాట్లాడితే, భారతదేశం వద్ద మూడు రకాల విమానాలు ఉన్నాయి, అవి అణు ఆయుధాలతో దాడి చేయగలవు. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ నివేదిక ప్రకారం భారతదేశం వద్ద మిరాజ్ 2000H, జాగ‌్వార్ HS, రఫెల్ ఎయిర్ డెలివర్డ్ వెపన్లు ఉన్నాయి. మిరాజ్ 2000ను కార్గిల్, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్‌లలో ఉపయోగించారు. పాకిస్తాన్ విషయానికొస్తే, దాని వద్ద రెండు రకాల విమానాలు ఉన్నాయి, అవి అణు ఆయుధాలను మోసుకెళ్లగలవు. వాటిలో మిరాజ్ III , IV ఉన్నాయి.
సముద్రతలం పై పాకిస్తాన్ కంటే భారతదేశం ఎంత బలంగా ఉంది?
సముద్రం మార్గం గుండా దాడి చేయడానికి భారతదేశం వద్ద నాలుగు రకాల అణు క్షిపణులు ఉన్నాయి, వాటిలో ధనుష్, K-15, K-4, K-5 ఉన్నాయి. ధనుష్ లఘుశ్రేణి బాలిస్టిక్ క్షిపణి , దాని పరిధి 350 నుంచి 600 కి.మీ. అయితే, K-15 పరిధి 700-750 కి.మీ., ఈ క్షిపణి 500-1000 కిలోగ్రాముల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. K-4, K-5 దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు. K-4 పరిధి 3,500 కి.మీ., అయితే K-5 పరిధి 5000 నుంచి 6000 కి.మీ. వరకు ఉంది. ఈ క్షిపణులన్నీ జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. పాకిస్తాన్ వద్ద సముద్రం మార్గంలో దాడి చేయడానికి కేవలం బాబర్-3 క్షిపణి మాత్రమే ఉంది.
భూ ఉపరితలం నుంచి దాడి చేయడంలో ఎవరు ముందున్నారు?
భూ ఉపరితలం విషయానికొస్తే, భారతదేశం, పాకిస్తాన్ రెండింటి వద్ద ఎనిమిది రకాల అణు క్షిపణులు ఉన్నాయి. భారతదేశం వద్ద పృథ్వీ-II, అగ్ని- I,II,III,IV,V,VI, P ఉన్నాయి. అయితే పాకిస్తాన్ వద్ద అబ్దాలి, ఘజ్నవి, షాహిన్- I,II,III, ఘౌరి, నస్ర, బాబర్ 1A/2 క్షిపణులు ఉన్నాయి. అగ్ని- I మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి, దాని పరిధి 700 నుంచి 1250 కి.మీ. అగ్ని- II,III,IV,V,VI మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, వాటి పరిధి 2000 నుంచి 5000 కి.మీ. వరకు ఉంది. పృథ్వీ-II లఘుశ్రేణి బాలిస్టిక్ క్షిపణి, దాని పరిధి 150 కి.మీ. వరకు ఉంది.





















