Corona Cases Update: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు 12 వేలకు పడిపోయాయి. కరోనా సెకండ్‌వేవ్ ప్రారంభమైన సమయం.. మార్చిలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి.
కొత్తగా 11,31,826 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. 356 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,42,02,202కి పెరిగింది. మొత్తం 3,35,83,3018 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,55,068 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గింది. కిందటి సంవత్సరం మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి. కేరళలో ఆరువేలమందికి పైగా వైరస్ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్లకు చేరింది. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది.
A total of 60,19,01,543 samples were tested up to October 25; of which 11,31,826 were tested on October 25: Ministry of Health pic.twitter.com/qbCEV3HX31
— ANI (@ANI) October 26, 2021
మధ్యప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన ఆరుగురు ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ సోకింది. వీరందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో ఆందోళన మెుదలవుతోంది. కొత్త వేరియంట్ సోకిన విషయాన్ని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం కూడా ధృవీకరించింది. కొత్త రకం వైరస్ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను ల్యాబోరేటరీకి పంపినట్లు మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం బాధితులంతా కోలుకున్నారని తెలిపింది.
ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను మార్చుకుని ప్రపంచ దేశాలను కరోనా భయపెడుతోంది. అయితే తాజాగా యూకేలో వెలుగులోకి వచ్చిన ఏవై. 4.2 హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లకు భిన్నంగా అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌పై భారత్ కూడా హై అలర్ట్‌లో ఉంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇది ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భారత్‌లో ఇప్పటివరకు ఈ ఏవై. 4.2 వైరస్ గుర్తులు కనబడలేదు. ఇప్పటివరకు 68 వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ వేరియంట్ అందులో లేదు.
"ఈ వేరియంట్‌పై మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం. మరిన్ని శాంపిల్స్‌ను పరీక్షిస్తాం. అంతర్జాతీయ ప్రయాణికులపై మరింత దృష్టి పెడతాం. ఈ ఏవై. 4.2 వేరియంట్ ఉన్న రోగులను వెంటనే గుర్తిస్తాం." - నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీనియర్ అధికారి
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?