Information and broadcasting ministry: 18 భారత్, 4 పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం- ఇదే కారణం
18 భారత్, నాలుగు పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
దేశంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంలో పలు యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వం వేటు వేసింది. దేశానికి చెందిన 18 యూట్యూబ్ ఛానళ్లతో పాటు పాకిస్థాన్‌కు చెందిన 4 యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తూ భారత సమాచారం- ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఇదే కారణం
ఈ 22 యూట్యూబ్ ఛానళ్లు.. పలు న్యూస్ ఛానళ్లకు చెందిన లోగోలను వాడుకుంటూ, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి వ్యూయర్స్‌ను మోసం చేస్తున్నాయని ఐ అండ్ బీ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ఛానెళ్లు ప్రధానంగా జమ్ముకశ్మీర్, భారత్ ఆర్మీపై తప్పుడు అంశాల్ని ప్రచారం చేస్తున్నాయి.
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా అకౌంట్లతోపాటు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను ఐ అండ్ బీ మినిస్ట్రీ నిషేధించింది.
ఇటీవల
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న పలు యూట్యూబ్, సామాజిక మాధ్యమాల అకౌంట్లను భారత్ ఇటీవల బ్లాక్ చేసింది. నిఘా విభాగం అందించిన సమాచారంతో సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వీటిని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆ యూట్యూబ్ ఛానళ్లకు 1.20 కోట్ల సబ్స్క్రైబర్లు, 130 కోట్ల వ్యూస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఛానళ్లను మరిన్నింటిని నిషేధిస్తామని అధికారులు తెలిపారు. ఆ దిశగా నిఘా విభాగం పని చేస్తున్నట్లు చెప్పారు.