75th Independence day: ఎర్రకోట మీదనే ప్రధాని ఎందుకు జెండా ఎగరేస్తారు? ఏంటీ దాని ప్రత్యేకత?
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏటా ఎర్రకోటపైనే జెండా ఎగరేస్తారు. ఇంతకీ ఎందుకు అక్కడే ఎగరేస్తారు. దాని చరిత్ర ఏంటి?
మెుదటి స్వాతంత్య్ర వేడుకలు మినహాయించి.. అన్నీ స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగరేసేది ఎర్రకోటపైనే. ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న స్వాతంత్య్ర. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారందరి.. త్యాగాలు, శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎర్రకోటపైనా ప్రధాన మంత్రి జెండా ఎగరేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోట మీద నుంచే దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తారు. దేశంలోని పరిస్థితిని.. భవిష్యత్ లో ఎలా ముందుకు వెళ్తున్నామని ప్రసంగిస్తారు.
ఎర్రకోటపై నుంచే జెండాను ఎగరేస్తారనే విషయంతోపాటు... 450 ఏళ్ల పాటు ఈ చారిత్రక కట్టడం అధికార కేంద్రంగా ఎలా ఉందో కూడా తెలుసుకుందాం.
1649లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోట కేంద్రంగా దిల్లీ నగరం ఏడుసార్లు నిర్మితమైంది. మొఘల్ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ ఎర్రకోటే సాక్ష్యం. చక్రవర్తుల వైభవాన్నే కాదు, పతనాన్నీ కూడా ఇది చూసింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటుకు కూడా ఎర్రకోట ఒకరకంగా కేంద్రమనే చెప్పుకోవాలి.
ఎర్రకోట నిర్మాణానికి 1639 ఏప్రిల్ 29న షాజహాన్ ఆదేశాలు జారీ చేశారు. అదే సంవత్సరం మే 12న కోటకు శంకుస్థాపన జరిగింది. ఫతేపూర్ సిక్రీలో ఉన్న ఎర్రరాతిని నదీ మార్గంగుండా కోట ప్రాంతానికి తరలించి నిర్మించారు. ఎరుపు రంగు రాతితో కట్టింది కాబట్టే దానికి ఎర్రకోట అనే పేరు వచ్చింది. తాజ్‌మహల్‌ను డిజైన్ చేసిన అహ్మద్ లాహోరి ఎర్రకోట డిజైన్‌లో కూడా ఉండటం విశేషం. ఆ తర్వాత ఎంతో మంది చక్రవర్తులు ఢిల్లీని పరిపాలించారు. ఎర్రకోట కేంద్రంగా చాలా వ్యవహారాలు జరిగేవి.
1857 ఏప్రిల్‌లో బ్రిటిష్ సైన్యంలో పని చేస్తున్న సైనికుడు మంగళ్ పాండే, బ్రిటిష్ వారిపై బెంగాల్ లోని బారక్ పూర్ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు. ఈ ప్రభావం మీరట్ నుంచి ఢిల్లీ వరకు చేరింది. సిపాయిల తిరుగుబాటు ఎర్రకోట వరకు పాకింది. బ్రిటీష్ సైనికాధికారులు, వారి కుటుంబ సభ్యుల హత్యకు దారి తీసింది. మే నెలలో జరిగిన ఘర్షణల సందర్భంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి బహదూర్ షా మద్దతు పలికారు.
నాలుగు నెలల తర్వాత బ్రిటీషర్లు ఎర్రకోట మీద తిరిగి పట్టుసాధించారు. ఈ ఘటనల తర్వాత బ్రిటీష్ సైనికుల్లో ఆగ్రహం ఎక్కువైంది. బ్రిటిష్ వారి ఒత్తిడితో చాలామంది ఢిల్లీ విడిచి వెళ్లిపోయారు.
బ్రిటిష్ పాలకులు ఎర్రకోటను రాజనివాసం నుంచి ఆర్మీ క్యాంప్ చేసుకున్నారు. కోట రూపు రేఖలను కూడా మార్చారు. యుద్ధ సమయంలో కోట కొంత దెబ్బతిన్నది. తర్వాత దానికి మరమ్మతులు చేశారు.
1857 తిరుగుబాటు తర్వాత భారతదేశ పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ ప్రభుత్వం తీసకుంది. 1877, 1903, 1911లలో ఎర్రకోటలో బ్రిటీష్ దర్బార్ జరిగిందని చరిత్ర చెబుతోంది. 1911 దిల్లీ దర్బార్ సందర్భంగానే బ్రిటీష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం తెలిపింది. ఎర్రకోట నుంచే బ్రిటీష్ రాజు, రాణి ముసమ్మాన్ బురుజు నుంచి జరోఖా దర్శన్ ఇచ్చారు.
ఆ సమయంలోనే...సుభాష్ చంద్రబోస్ చలో దిల్లీ అనే నినాదాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర బ్రిటిష్ వారి సమాధుల మీదుగా నడవాలని బోస్ సైనికులకు చెప్పారు. ఆ తర్వాత.. రెండో ప్రపంచ యుద్ధం, సమయంలో బోస్ ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ వెళ్లడం, జపాన్ ఓడిపోవడం, నేతాజీ కనిపించకపోవడం జరిగాయి. అయితే ఆ టైమ్ లోనే.. కొంతమంది ఆర్మీ అధికారులను బ్రిటిష్ అధికారులు బందీలుగా పట్టుకున్నారు. ఎర్రకోటలోనే వారిని విచారించారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీదనే జెండా ఎగరవేశారు. 2003 డిసెంబర్ వరకు ఇది భారత సైన్యానికి క్యాంపుగా ఉండేది. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. 2007లో యునెస్కో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.
ఎన్నో పోరాటాలు చూసి.. ఎన్నో త్యాగాలకు సాక్ష్యంగా ఉన్నది ఎర్రకోట. మెుదటి నుంచి ఎర్రకోటపైనే జెండా ఎగరేయడంతో సాంప్రదాయం అలా కొనసాగుతూ వస్తోంది.