Nayab Singh Saini: హరియాణాలో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం - నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
Harayana News: హరియాణా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఖట్టర్ రాజీనామా చేయగా.. నూతన సీఎం ఎన్నిక అనివార్యమైంది.
Nayab Saini New CM Of Haryana: హరియాణాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన్ను నూతన సీఎంగా ఎన్నుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు వెల్లడించారు. ప్రస్తుతం సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. కాగా, ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, జేజేపీల మధ్య ఇబ్బందులు తలెత్తగా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తదుపరి సీఎం ఎవరనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ఖట్టరే మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. దీంతో పాటే పలువురు కీలక నేతల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. చివరకు నాయబ్ సైనీ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఈయన ఖట్టర్ కు అత్యంత సన్నిహితుడు. కాగా, నాయబ్ సింగ్ సైనీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మరోవైపు, సీఎంగా రాజీనామా చేసిన ఖట్టర్ లోక్ సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే, నాయబ్ సింగ్ ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు.. ఎమ్మెల్యే సుభాష్ సుధా తెలిపారు. సైనీ పేరును ప్రతిపాదించగా.. ఆ సమావేశం నుంచి అనిల్ విజ్ వెళ్లిపోయారు. బీజేపీ నిర్ణయంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ నేపథ్యం
ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సైనీ 1996లో బీజేపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీలో పలు పదవులు చేపట్టి సేవలందించారు. 2005లో బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2014లో నారాయణ్ గడ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో గెలుపొందారు. గతేడాది అక్టోబర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరియాణా ఓబీసీల్లో సైనీల జనాభా దాదాపు 8 శాతంగా ఉంది. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయబ్ కు సీఎం పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) కూటమిలో ఇబ్బందులు తలెత్తడంతో ఖట్టర్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ దుష్యంత్ చౌతాలా, మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలుండగా సర్కారు ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువగా రావడంతో జననాయర్ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Also Read: CAA: సీఏఏ అమలు - కేంద్రంపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర అసహనం, ఫస్ట్ రియాక్షనే పీక్స్