(Source: ECI/ABP News/ABP Majha)
Dwaraka Darshan: శ్రీకృష్ణుడి ద్వారక చూడాలనుకుంటున్నారా, సబ్ మెరైన్ రెడీ చేస్తున్న గుజరాత్ సర్కార్
గుజరాత్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేయబోతోంది. సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని పర్యాటకులు వీక్షించేందుకు జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
Submarine Service For Dwaraka Darshan : గుజరాత్ (Gujarath ) ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేయబోతోంది. సముద్ర గర్భంలోని ద్వారక (Dwaraka )నగరాన్ని పర్యాటకులు వీక్షించేందుకు జలాంతర్గామి సర్వీసుల (Submarine Service)ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ జలాంతర్గామిలో ఒకేసారి 24 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉండనున్నారు. అరేబియా సముద్రం లోపల 300 అడుగుల వరకు ప్రయాణించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం లోపల ద్వారక నగర శిథిలాలు, అరుదైన సముద్ర జీవాలను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గమి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంపై పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు ధామాలలో ద్వారక ప్రముఖమైనది
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. హిందువులు పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారక ప్రముఖమైంది. భారతదేశానికి నలువైపులా నాలుగు ధామాలు ఉన్నాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరిజగన్నాథ క్షేత్రం, పశ్చిమాన ద్వారకపురి నగరం. ద్వారక పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరానికి ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లడం లేదు. శ్రీకృష్ణుడు నిర్మించిన నగరాన్ని భక్తులు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకులు, భక్తులు ద్వారకా నగరం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా జలాంతర్గామి సర్వీసులు రెడీ చేస్తోంది. ముంబయికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ మజాగాన్‌తో బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని భక్తులు, పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతన్నారు.
1983-86లో పశ్చిమ తీరంలో శిథిలాల గుర్తింపు
క్రీ.పూ. 3138లో మహాభారత యుద్ధం జరిగింది. 36 ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించినట్లు పరిశోధనల్లో తేలింది.గోమతీ నదీ తీరంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించారు. అందమైన కట్టడాలతో స్వర్గాన్ని తలపించేది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వారకా నగరం ఆరేబియా సముద్రగర్భంలో కలిసి పోయింది. ద్వారకాపురి క్రీ.పూ. 1443లో సముద్రంలో మునిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ సముద్రతీరంలో ద్వారకా నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. 1983-86లో గుజరాత్ పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ద్వారకా నగరం శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ తీరం నుంచి 20 కి.మీ. దూరంలో సముద్ర గర్భంలో 40 మీ. లోతులో చారిత్రక నగరం ఉన్నట్లు గుర్తించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు ఉన్నాయి. సుమేరియన్ నాగరికత, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే ప్రాచీనమైనవని తేలింది. అప్పట్లో సుముద్రాల్లో ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతుంది.