G20 Summit: భారత్ మండపంపై ప్రత్యేక ఆకర్షణగా కోణార్క్ వీల్
G20 Summit: జీ20 సదస్సులోని భారత మండపంపై ఏర్పాటు చేసిన కోణార్క్ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
G20 Summit: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందుకు ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం వేదికైంది. ఈ మండపంపైనే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేస్తున్న దేశాధినేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అయితే భారత్ మండపంపై బ్యాగ్రౌండ్ లో ఆకట్టుకునే రీతిలో కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు చేశారు. దానిపై ఒక వైపు జీ20 ఇండియా 2023 అని మరోవైపు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ- వన్ ఫ్యూచర్ అనే అక్షరాలను రాసుకొచ్చారు. ఈ ప్రత్యేక ఏర్పాటు అతిథులను భలేగా ఆకట్టుకుంటోంది. మధ్యలో అశోక చక్రాన్ని ప్రతిబింబించేలా కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే అనేక చిహ్నాలను ఈ మండపం వద్ద ఏర్పాటు చేశారు. వాటిల్లో ఈ చక్రం కూడా ఒకటి. ఈ చక్రం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టిని కూడా ఆకర్షించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జో బైడెన్ కు ఈ చక్రం ప్రాముఖ్యతను వివరించి చెప్పారు.
కోణార్క్ చక్రాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవ-1 పాలనలో నిర్మించారు. ఇది భ్రమణం, సమయం, పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, సమాజ పురోగతి కోసం నిబద్ధతకు గుర్తుగా నిలుస్తోంది. 13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. చిన్నారుల నుంచి యవ్వనంలో ఉండేవారికి, మలిసంధ్యలో ఉన్నవారికి ఇలా ఓ వ్యక్తి జీవితంలో వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని అందిస్తోంది కోణార్క్ ఆలయం. నేలకు రెండు అడుగుల ఎత్తులో అంటే పిల్లలకు కనిపించే విధంగా ఉండే వివిధ రకాల జంతువులు, పక్షులు వాటి విన్యాసాలు కనిపిస్తాయి. బొమ్మలతో పాటూ వాటి ఆహారపు అలవాట్లు కూడా దర్శనమివ్వడం పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఈ బొమ్మలకు పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం, కుస్తీ లాంటి విభిన్న రకాల కళలున్న శిల్పాలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటాయి. ఇంకా... రాజకీయం, యుద్ధ కళలు, రాజ్య పాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు విద్యార్థుల మెదడుకి పదును పెడతాయి.
కోణార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది. కోన అంటే మూల అని, ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం. ఇది చంద్రభాగ నది ఒడ్డున నిర్మితమైంది. ప్రధాన ఆలయ సముదాయంలోని భారీ సూర్య విగ్రహంపై సూర్యుని కిరణాలు పడే విధంగా నిర్మించారు. 1884 సంవత్సరంలో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చారు. ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల వరుస ఉంది. ఈ 24 చక్రాలు గంటలను సూచిస్తాయని చెబుతారు. 10 రూపాయల నోటులో కనిపించే చక్రం ఇదే. ఒడిశాలో పూరీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ దేవాలయాన్ని గంగా వంశానికి చెందిన నర్సింహదేవ (1236-1264) నిర్మించారు.