Caste Census| కేంద్రం చేపట్టనున్న కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
Caste Census In India | కేంద్ర మంత్రి మండలి కులగణన చేపట్టాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

NV Ramana comments on Caste Census | ఢిల్లీ: జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) హర్షం వ్యక్తం చేశారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని అభిప్రాయపడ్డారు. కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం అన్న ఆయన... చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన దిశలో వేసిన సాహసోపేతమైన అడుగు అని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు అన్నారు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.
సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది అని ఏ సందేశహం లేకుండా ఆశిస్తున్నానని, ఈ ప్రక్రియను నమ్ముతాను అన్నారు.
జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇది సామూహిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న సమగ్ర వినియోగ ప్రక్రియగా మారాలని ఎన్వీ రమణ ఆశిస్తున్నారు.
ఇది తమ ఘనతే అంటున్న కాంగ్రెస్
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మోడల్, బిహార్‌లో రాజకీయ అవసరాల కోసమే కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు కులగణన చేసే ప్రసక్తే లేదంటూ కోర్టుల్లో అఫిడవిట్‌లు ఇచ్చిన కేంద్రం ఇటీవల కుల గణన నిర్ణయం తీసుకోవడం తమ ఘనతే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, మోదీ సర్కార్ కులగణన నిర్ణయం తీసుకునేలా కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ చేపట్టిన కుల గణన సర్వే కూడా కేంద్రానికి మోడల్‌గా రేవంత్ అన్నారు. గత ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఆ సమయంలోనే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే కుల గణన అవసరమని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.






















