Vande Bharat News: వెజ్ బదులు నాన్‌వెజ్, వందేభారత్ వెయిటర్ చెంప పగలగొట్టిన ప్రయాణికుడు - వైరల్ వీడియో
Vande Bharat Viral Video: హౌరా నుంచి రాంచీ వెళ్తున్న వందేభారత్ రైలులో ఓ ప్రయాణికుడికి సిబ్బంది పొరపాటున మరో ఆహారపు ప్యాకెట్ అందించారు. అందులో మాంసాహారం ఉండడంతో సదరు ప్రయాణికుడు చిందులు తొక్కారు.
Telugu News: వందేభారత్ రైలుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ప్రయాణికుడైన ఓ పెద్దాయన వందేభారత్ లో పని చేసే వెయిటర్‌పై చేయి చేసుకోవడం ఇప్పుడు సంచలనం అయింది. ఆయన ఏకంగా వెయిటర్ చెంపపై కొట్టి నానా బీభత్సం చేశారు. హౌరా నుంచి రాంచీ వెళ్తున్న వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
హౌరా నుంచి రాంచీ వెళ్తున్న వందేభారత్ రైలులో వయసు పైబడిన ఓ ప్రయాణికుడికి వందేభారత్ సిబ్బంది పొరపాటున మరో ఆహారపు ప్యాకెట్ అందించారు. అందులో మాంసాహారం ఉండడంతో సదరు ప్రయాణికుడు చిందులు తొక్కారు. తాను శాకాహారం ఆర్డర్ చేస్తే తనకు మాంసాహారం ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జూలై 26న హౌరా నుంచి రాంచీ వందేభారత్ రైలులో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, సదరు ప్రయాణికుడు ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకెట్‌పై ఉన్న మాంసాహారం అని సూచించే గుర్తును చూడకుండా తినేశారు. తర్వాత అది మాంసాహారం అని తెలుసుకొని వెయిటర్ ను గట్టిగా రెండుసార్లు కొట్టారు.
అయితే, తోటి ప్రయాణికులంతా వెయిటర్ కు మద్దతుగా నిలిచారు. పొరపాటు జరిగినప్పటికీ విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడం నేరమని.. అతనికి క్షమాపణలు చెప్పాలని తోటి ప్రయాణికులు సదరు ప్రయాణికుడికి సూచించారు. అయినా ఆయన గొడవ పడడం ఆపలేదు. ‘‘అతణ్ని ఎందుకు కొట్టావ్.. మీ వయసేంటి?’’ అని గట్టిగా అరుస్తుండడం వీడియోలో ఉంది. కానీ, ఆ వెయిటర్ భయపడిపోతూ ఆ పెద్దాయనకు క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు.
A person slapped a waiter for mistakenly serving him non-vegetarian food. Others came to support the waiter.#KaleshOfVandeBharatpic.twitter.com/eQTQdLMewU
— Kapil (@kapsology) July 29, 2024
స్పందించిన రైల్వే
వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై తూర్పు రైల్వేశాఖ కూడా స్పందించాల్సి వచ్చింది. ‘‘పొరబాటు జరగడాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే, ఆ ప్రయాణికుడు సిబ్బందిపై దాడి చేయడాన్ని తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సమస్యను పరిష్కరించాం’’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.