Jahangirpuri Demolition Drive: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీం సీరియస్- కీలక ఆదేశాలు
జహంగీర్‌పురిలో కూల్చివేతలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. రెండు వారాల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది.
దిల్లీ జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణల తొలగింపును తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆపాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. జహంగీర్‌పురి కూల్చివేతలపై 'స్టేటస్ కో' (యధాతథ స్థితి) అమలు చేయాలని ధర్మాసనం వెల్లడించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎమ్) మేయర్ కూల్చివేతలు కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.
నోటిసులు
చట్ట విరుద్ధ ఆక్రమణలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలేమా-ఈ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, భవన నిర్మాణ వస్తువులు, స్టాల్స్, బడ్డీలు, కుర్చీలు, బల్లలు వంటివాటిని తొలగించేందుకు ముందుగా నోటీసులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు. ఈ పిటిషన్‌ను ఓ సంస్థ దాఖలు చేసిందని, వ్యక్తులు వచ్చి తమకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదని చెప్పాలని అన్నారు. ప్రభుత్వం ముందస్తు నోటీసులను ఇచ్చిందని చెప్పారు.
మా మాటే వినరా!
ధర్మాసనం స్పందిస్తూ బుధవారం తాను ఇచ్చిన ఆదేశాలను మేయర్‌కు తెలియజేసిన తర్వాత జరిగిన కూల్చివేతలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. వ్యక్తులు వ్యక్తిగతంగా అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరింది. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించాలని, తదుపరి విచారణ రెండు వారాల తర్వాత జరుగుతుందని తెలిపింది.
గత శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస, దిల్లీలోని జహంగీర్‌పురి పరిసరాల్లో కూల్చివేతలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏంటని స్థానికులు ఆగ్రహించారు. బుల్‌డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు కూల్చివేతలను రెండు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Also Read: UK PM Boris Johnson India Visit: తొలిసారి భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్- చరఖా తిప్పిన జాన్సన్
Also Read: NASA Perseverance Rover: మార్స్ డెల్టాలో వింత రంగుల్లో రాళ్లు- ఆ గ్రహంపై నిజంగా నీరు ఉండేదా?