Bus Driver Suspended: బస్టాప్‌లో మహిళల కోసం ఆగని బస్సు, వెంటనే డ్రైవర్ సస్పెండ్ - వీడియో
Bus Driver Suspended: బస్టాప్‌లో వేచి చూస్తున్న మహిళల కోసం బస్సు ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ ను ఢిల్లీ సర్కారు సస్పెండ్ చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని హెచ్చరించింది.
Bus Driver Suspended: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళల్ని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన బస్సు డ్రైవర్ పై ఢిల్లీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఢిల్లీలోని ఓ బస్టాప్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు చేరుకోవడంతో ఆ బస్సు డ్రైవర్ తీరుపై సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ ఆ డ్రైవర్ ను ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ముగ్గురు మహిళలు బస్సు కోసం ఓ బస్ స్టాప్ లో వేచి చూస్తున్నారు. అదే దారిలో వెళ్తున్న ఓ బస్సు.. స్టాప్ లో ఆగలేదు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును నెమ్మదిగా పోనిచ్చిన ఆ డ్రైవర్.. ఆ బస్సు ఎక్కేందుకు పరుగులు పెట్టిన మహిళలను చూసి కూడా ఆపకుండా వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీలో మహిళల ఇబ్బందులు అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వ్యవహారం కేజ్రీవాల్ సర్కారు దృష్టికి వెళ్లడంతో ఆ డ్రైవర్ ను గుర్తించి వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది.
ఇలాంటివి చూస్తూ ఊరుకునేది లేదు, కేజ్రీవాల్ వార్నింగ్
ఈ వీడియోను స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేస్తూ.. కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికుల కోసం బస్సు ఆపడం లేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుండి కొందరు బస్సు డ్రైవర్లు వారిని చూసి కూడా బస్సులు ఆపకుండా వెళ్తున్నారని ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ధోరణిని చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బస్సులు ప్రతి ఒక్క స్టాప్‌లలో కచ్చితంగా ఆపాల్సిందేనని మహిళా, పురుష డ్రైవర్లను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
ఇలాంటి ఘటనలను వీడియోలు తీసి పంపండి
సీఎం కేజ్రీవాల్ ట్వీట్ పై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు తీయాలని, వాటిని ప్రభుత్వానికి పంపితే సంబంధిత డ్రైవర్లపై, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ప్రవర్తన ఎట్టిపరిస్థితుల్లో ఆమోద యోగ్యం కాదన్న మంత్రి.. కఠిన చర్యలతోనే వీటిని ఆపగలమని తెలిపారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాల మేరకు సదరు డ్రైవర్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విధుల నుండి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర సిబ్బందిపైనా విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఆశయం గొప్పదే, అమలే..?
దేశ రాజధానిలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో, మెట్రోల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు. 2019లో రక్షా బంధన్ సందర్భంగా ఈ కానుకను ఇచ్చింది. మహిళల ఉపాధి అవకాశాలను పెంచడం, రాజధానిలో వారికి భద్రత కల్పించడం లాంటి లక్ష్యాలతో ఎంతో గొప్పగా ఈ ఫ్రీ జర్నీ పథకాన్ని ప్రారంభించగా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. బస్ స్టాప్‌లో మహిళలు కనిపిస్తే చాలా బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్న ఘటనలు ఎప్పుడూ ఎదురవుతూనే ఉన్నాయి. బస్సు డ్రైవర్ల తీరుపై మహిళలు ఫిర్యాదులు చేస్తున్నా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనతో ఈ అంశం చర్చనీయాంశంగా మారి ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు ఢిల్లీ వాసులు అభిప్రాయపడుతున్నారు.
ऐसी शिकायतें आ रही हैं कि कुछ ड्राइवर महिलाओं को देखकर बस नहीं रोकते क्योंकि महिलाओं का सफ़र फ़्री है। इसे बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। इस बस ड्राइवर के ख़िलाफ़ सख़्त एक्शन लिया जा रहा है। pic.twitter.com/oqbzgMDoOB
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2023