New Vehicle Rating: కార్లకు సొంతంగా భద్రతా రేటింగ్ ఇవ్వబోతున్న కేంద్రం, అక్టోబర్ నుంచి ప్రారంభించేందుకు కసరత్తు
New Vehicle Rating: సొంతంగా కార్లకు రేటింగ్ ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి భారత్‌లో తయారయ్యే కార్లకు రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
New Vehicle Rating: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ కార్ల భద్రతా రేటింగ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి సొంతంగా సేఫ్టీ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రహదారి, రవాణా మంత్రి శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి. భద్రత ప్రమాణాలు, BNCAP ఖరారు చేసిందని.. దీంతో కార్ల తయారీదారులు తప్పనిసరి భద్రతా పాటిస్తారని, ఇది కొనుగోలుదారులను సురక్షితంగా ఉండటానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ పరీక్ష ఫలితాల ఆధారంగా కార్లకు ఒకటి నుంచి ఐదు స్టార్ల రేటింగ్ ఇవ్వనున్నారు.
దేశీయ కార్ల తయారీదారులకు మేలు
BNCAP(భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) అపెక్స్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత స్టార్ రేటింగ్ ను, టెస్ట్ ఫలితాలను దాని వెబ్‌సైట్ లో ఉంచనుంది. దీనిని కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఈ రేటింగ్ లో పూర్తి పారదర్శకంగా ఉండనున్నాయి. ఈ రేటింగ్ కోసం ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫ్యాక్చరర్లు తమ ఉత్పత్తులను BNCAP కి ఇస్తారు. లేదంటే డీలర్ల షోరూమ్‌ల నుంచి BNCAP యే ర్యాండమ్ ఉత్పత్తిని ఎంపిక చేసి దానిపై టెస్టింగ్ నిర్వహిస్తారు. కేంద్ర సర్కారు తీసుకురాబోయే ఈ విధానంతో దేశీయ కార్ల తయారీదారులకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాళ్లు సెఫ్టీ టెస్టింగ్ కోసం తమ కార్లను విదేశాలకు పంపించి అక్కడ వాటికి సేఫ్టీ టెస్ట్ చేయించే వారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇప్పుడు ఆ బాధలు తప్పుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
సేఫ్టీ కార్లే కావాలంటున్న భారతీయులు
ఈ మధ్య కాలంలో భద్రతకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు చాలా మంది. కార్ల కొనుగోలు విషయానికి వస్తే ఇతర ఫీచర్ల కంటే సేఫ్టీ ఫీచర్లు ఎక్కువ ఉండాలని భావిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. క్రాష్ రేటింగ్, ఎయిర్ బ్యాగ్‌ల సంఖ్యను ప్రధానంగా తనిఖీ చేసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తుంటే.. ఇతర ఫీచర్ల కంటే భద్రతే ముఖ్యమని చాలా మంది భావిస్తున్నట్లు నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగులపైనే కస్టమర్లు మనసు పారేసుకుంటున్నట్లు స్కోడా ఆటో ఇండియా, ఎన్ఐక్యూ బేసేస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రతి 10 మందిలో 9 మంది సేఫ్టీ ఫీచర్లు, వాటికి ఇచ్చే రేటింగ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత ఫ్యూయల్ మైలేజీ తదితర ఫీచర్లు చూస్తున్నారు. 67 శాతం మంది సేఫ్టీ రేటింగ్ వేరియంట్లకే మొగ్గు చూపుతున్నారు. 18-54 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 80 శాతం మంది పురుషులు, 20 శాతం మంది మహిళలు ఉన్నారు. కార్లు కొనాలనుకునే వారు.. ఆయా కార్ల క్రాష్ రేటింగ్ పై 22.3 శాతం మంది, వాటిల్లో వాడే ఎయిర్ బ్యాగ్స్ గురించి 21.6 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. 15 శాతం మంది ఫ్యూయల్ మైలేజీకి ప్రాధాన్యం ఇస్తున్నారట.