సమోసా లేకుండానే ఇండియా అలయన్స్ సమావేశం ముగిసిందన్న జేడీయూ ఎంపీ పింటూ
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోడీ భావిస్తుంటే, ఎలాగైనా చెక్ పెట్టాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది.
Lok Sabha Elections-2024 : 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections 2024) గెలుపే లక్ష్యంగా ఐఎన్‌డీఐఏ(I.N.D.I.A) పావులు కదుపుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోడీ (Narendra Modi) భావిస్తుంటే, ఎలాగైనా చెక్ పెట్టాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ ( Delhi ) లోని అశోకా హోటల్ ( Ashoka Hotel) లో మంగళవారం జరిగిన సమావేశంపై జేడీయూ ఎంపీ సుశీల్ కుమార్ పింటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల సమావేశంలో అగ్రనేతలు పాల్గొనప్పటికీ, కీలక అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. సమావేశం మొత్తం చాయ్, బిస్కెట్లకే పరిమితం అయిందంటూ సెటైర్లు వేశారు. నిధులు కొరత ఉండటంతోనే చాయ్ బిస్కెట్ మాత్రమే ఇచ్చారని, సమెసా ఇవ్వాలేదన్నారు. అందుకే ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ రూ.138, రూ.1380, రూ.13,800లతో విరాళాలు సేకరిస్తోందని విమర్శలు గుప్పించారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై కూటమి సమావేశంలో చర్చించామని అగ్రనేతలు చెబుతున్నారు. జేడీయూ ఎంపీ సుశీల్ కుమార్ పింటూ మాత్రం, ఎలాంటి సీరియస్ అంశాలపై చర్చే జరగలేదని స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
కూటమి నాలుగో సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. 28 విపక్ష పార్టీలకు కీలక నేతలంతా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్, కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు. మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వంతో పాటు పార్లమెంటులో విపక్ష ఎంపీలపై వేటు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. దేశ వ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించాలని అంగీకారానికి వచ్చారు.
మమతా బెనర్జీ ప్రతిపాదన, వద్దని వారించిన ఖర్గే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. సమష్టిగా పోరాటం చేసి, విజయం సాధించిన తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయిద్దామని ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు.
వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ
వచ్చే ఏడాది జనవరిలో సీట్ల పంపకాలను ఫైనల్ చేయాలని ఇప్పటికే కూటమి నిర్ణయించింది. 80 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ పై ఇండియా కూటమి గురి పెట్టింది. అందులో భాగంగా వారణాసి నుంచి ప్రియాంకా గాంధీని బరిలోకి దించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడంతో...రాష్ట్ర మొత్తం ఆ ప్రభావం పని చేసింది. దీంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీకి 62 సీట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో 71 స్థానాల్లో విజయం సాధించింది.