Delhi Meeting : "రాజధాని"కే నిధులడిగిన ఏపీ - లెక్కలు చెప్పమన్న కేంద్రం ! ఢిల్లీ మీటింగ్‌లో జరిగింది ఏమిటంటే ?
విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకలేదు.
Delhi Meeting : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానులకు కాకుండా రాజధానికి నిధులను కేంద్రాన్ని అడిగింది. రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని ఏపీ కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. ఇప్పటికే ఇచ్చిన రూ.1500కోట్ల ఖర్చుల వివరాలను అడిగింది. నిజానికి గతంలో రూ. రెండున్నర వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది. అయితే రూ. పదిహేను వందల కోట్లు ఏపీకి వచ్చాయి. మరో రూ. వెయ్యి కోట్లు విడుదల కావాల్సి ఉంది. కానీ ఉపయోగించిన రూ. పదిహేను వందల కోట్లకు యూసీలు సమర్పించకపోవడంతో అవి విడుదల కాలేదు. కేంద్రం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సమావేశంలో రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో సూచించిన రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపీ కోరింది. కానీ దీనిపై హోంశాఖ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
విభజన సమస్యలపై చర్చ - కానీ పరిష్కారం ?
కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో ఏపీకి రైల్వే జోన్ తో పాటు రాజధానికి నిధులు, తెలంగాణ నుంచి బాకీలు ఇప్పించడం వంటివి ఉన్నాయి. అయితే ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని.. ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్‌కు వదిలేయాని హోంశాఖ సూచించింది. ఇప్పటికే రైల్వే జోన్ ఇచ్చేస్తున్నట్లు పలుమార్లు చెప్పిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం సాధ్యం కాదని, కేంద్ర కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన బాకీలు, సంస్ధల విభజనపై ఏపీ లేవనెత్తిన ఏ అంశంలోనూ తెలంగాణ అంగీకారం తెలపలేదు. దీంతో విభజన సమస్యలపై మరోసారి ఎలాంటి స్పష్టత లేకుండానే ఈ ముగిసింది.
విద్యుత్ బకాయిల అంశంపై చర్చించని ఇరు రాష్ట్రాలు
విద్యుత్ బకాయిల అంశం అసలు ఈ సమావేశంలో చర్చకు కాలేదు. ఇప్పటికే విద్యుత్ బకాయిల చెల్లింపుపై రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతోంది. గత నెలలో తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశాన్ని ఏపీ లేవనెత్తగా తెలంగాణ రాత పూర్వకంగా సమాధానం పంపుతామని తెలిపింది. ఇందులో ప్రధానంగా నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ చేయాల్సినవాటిని ఇతర మంత్రిత్వ శాఖలు చేస్తున్నాయని, ఇది సరికాదని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలు కేంద్రం వద్ద తమ వాదన వినిపిస్తాయని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సమావేశంలో చర్చించలేదు.
ఏ ఫలితం లేకుండానే ముగిసిన సమావేశం
సింగరేణి కాలరీస్, దానికి అనుబంధంగా అప్మెల్, విభజన చట్టంలోని 9, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన, పలు సంస్థల మధ్య ఆస్తుల, అప్పుల పంపిణీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విభజన, సెంట్రల్ స్పాన్సర్డ్ పథకాలకు సంబంధించిన తెలంగాణ నిధులు ఏపీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం వంటివి చర్చించారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అంశంపై కూడా మీటింగ్‌లో స్పష్టత రాలేదు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలం సహా సమీప ప్రాంతాల ముంపు, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం వంటి వాటిపై చర్చించలేదు. మొత్తంగా సమావేశం రొటీన్‌గా సాగింది. ఏపీ, తెలంగాణ ఎప్పటిలాగే తమ తమ వాదనలకు కట్టుబడ్డాయి. అయితే వీరికి పరిష్కారం చూపడంలో కేంద్రం మరోసారి విఫలమైంది.