Gujarat Elections: హిందుత్వ కాదు "మోదీత్వ" - కొత్త వ్యూహంతో బరిలోకి దిగనున్న బీజేపీ
Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో భాజపా కొత్త వ్యూహంతో బరిలోకి దిగనుంది.
Gujarat Elections:
వ్యూహం మార్చిన భాజపా..
ఆపరేషన్ గుజరాత్. ఇప్పుడు భాజపా టార్గెట్ ఇదే. ఈ రాష్ట్రంలో గెలవటం ఆ పార్టీకి చాలా అవసరం. ప్రతిష్ఠాత్మకం కూడా. అందుకే...ఎన్నికల బరిలోకి దిగేముందు అన్ని అస్త్రాలనూ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు వెలువడినా...గుజరాత్ ఎలక్షన్ డేట్ ఇంకా తేలాల్సి ఉంది. తేదీలు ఖరారు కాక ముందే పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అందరి కన్నా ముందుగా ఆప్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. అటు భాజపా కూడా గౌరవ్ యాత్ర పేరిట క్యాంపెయిన్ షురూ చేసింది. ఎప్పుడూ హిందుత్వ కార్డుతో రాజకీయాలు చేసే భాజపా...ఈ సారి వ్యూహం మార్చుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఊహించని విధంగా కొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దూకాలని
భావిస్తోంది. "మోదీ ఫ్యాక్టర్" వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ ఎలాగో నమ్మకంగా ఉంది. అందుకే..ఈ సారి "హిందుత్వ" బదులుగా "మోదీత్వ" బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా...అక్కడ "మోదీ చరిష్మాను" వాడుకోవడం భాజపా వ్యూహం. అలాంటిది..మోదీ సొంత రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతుంటే...ఆ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
క్లుప్తంగా చెప్పాలంటే...ఈ సారి గుజరాత్ ఎన్నికలు "మోదీ చరిష్మా" చుట్టూనే తిరగనున్నాయి. దాదాపు మూడు నెలలుగా గుజరాత్‌కు తరచుగా వెళ్తున్నారు ప్రధాని మోదీ. కొత్త ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయడం, రోడ్ షోలు నిర్వహించటం..ఎన్నికల వ్యూహంలో భాగమే. ఈ ఏడాది మార్చి నుంచి నెలనెలా గుజరాత్ పర్యటనకు వెళ్తున్నారు మోదీ. ఆయన రోడ్‌షో నిర్వహించిన ప్రతిసారీ పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.ఆయన చరిష్మాకు ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదని ఈ సంఖ్యే చెబుతోందని భాజపా గట్టిగానే చెబుతోంది. అయితే..ఆప్ రాకతో భాజపాకు గట్టి పోటీ ఎదురు కానుంది. కానీ....మోదీ చరిష్మాను ఢీకొట్టడం అంత సులువేమీ కాదన్నది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అటు కాంగ్రెస్ కూడా భాజపాపై పోరాడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.
2017లోనూ ఇదే విధంగా...
గౌరవ్ యాత్ర ప్రారంభించింది భాజపా. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ఈ యాత్రను వినియోగించుకుంటోంది. ఇక ఇటీవల గుజరాత్‌లో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పోకి హాజరైన ప్రధాని మోదీ..."ప్రధాని అయినా గుజరాత్ బిడ్డనే" అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా గౌరవ్ యాత్రలో చురుగ్గా పాల్గొంటు న్నారు. ప్రచార బాధ్యతలు తీసుకుంటున్నారు. దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. అదే ట్రెండ్‌ను ఈ సారి
కొనసాగించాలని పట్టుదలతో ఉంది. 2017లోనూ భాజపా ఇదే వ్యూహంతో ముందుకెళ్లింది. ఎన్నికల తేదీ ప్రకటించక ముందు నుంచే ప్రధాని మోదీ పదేపదే రోడ్‌షోలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్నారు. ఆ ఫలితంగానే...విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే వ్యూహం అమలు చేసి విజయం సాధించాలని చూస్తోంది భాజపా. ఏదేమైనా...ఆప్ కూడా ప్రచారం గట్టిగానే చేస్తుండటం వల్ల మునుపటి కన్నా అప్రమత్తంగా ఉంటోంది కాషాయ పార్టీ. ఇప్పుడే ఇలా ఉంటే...ఎన్నికల తేదీలు ప్రకటించాక రాష్ట్రంలో రాజకీయ వేడి ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.