Afghanistan Taliban Rule: అఫ్గాన్ లో తాలిబన్ల సర్కార్.. అధినేతగా ముల్లా బరాదర్!
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైనట్లే తెలుస్తోంది. ప్రభుత్వ అధినేతగా ముల్లా బరాదర్ ను తాలిబన్లు ఎన్నుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వారి ప్రభుత్వం పేరుతో హోర్డింగ్ లు వెలిశాయి.
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. తాలిబన్ ప్రభుత్వ అధినేతగా ముల్లా బరాదర్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన ఇప్పటి వరకు తాలిబన్ల పొలిటికల్ కార్యాలయానికి అధిపతిగా ఉన్నారు. ఈ విషయాన్ని ముగ్గురు తాలిబన్ నాయకులు ధ్రువీకరించినట్లు ఆంగ్ల వార్త సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఇక తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్, షేర్ మహమ్మద్ స్టాన్జాయ్‌లకు కీలక స్థానాలు దక్కనున్నాయి. అయితే ఇప్పటికే తాలిబన్ల ప్రభుత్వం పేరుతో చాలా హోర్డింగ్ లు అఫ్గాన్ లో కనిపిస్తున్నాయి.
اطلاعاتو او کلتور وزارت په #کابل کې د کابینې اعلانولو په خاطر پر دېوالونو د شعارونو کښل او په ښار کې د بیرغونو پورته کولو بهیر پیل کړ. pic.twitter.com/9rwWdmi7gT
— Ahmadullah Muttaqi (@Ahmadmuttaqi01) September 3, 2021
గంటల్లో ప్రకటన..
ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆఫ్గానిస్థాన్ లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. తాలిబన్ సర్కారు ఏర్పడ్డ తర్వాత రోజువారీ పరిపాలనా వ్యవహారాలను… రాజకీయ విభాగపు అగ్రనేత అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకుంటుంది.
సుప్రీం లీడర్..
పరిపాలన కోసం ఎలాంటి మండలి ఏర్పాటయినా.. దానికి అధినాయకుడిగా తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా ఉండనున్నారు. తాలిబన్ ఆధీనంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండటతో… కాందహార్‌లో ఉన్న హైబతుల్లా అఖుంద్‌జాదాతోపాటు బరాదర్… అజ్ఞాతం వీడనున్నారు. రెండు దశాబ్దాల అనంతరం ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిస్థాయిలో వెళ్లిపోయాయి.
మరోవైపు.. ఇప్పటికీ, కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ ప్రావిన్సుపై దాడికి దిగినప్పుడు ఎదురుదెబ్బ తగలడంతో.. తాజాగా చర్చల బాట పట్టారు. పర్వాన్ ప్రాంతంలో పంజ్‌షీర్ నేతలు, పలువురు ఇతర గిరిజన తెగల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఆయుధాలు వీడి తమతో చేతులు కలపాలని పంజ్‌షీర్ ఫైటర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.