(Source: ECI/ABP News/ABP Majha)
ED Summons Jharkhand CM: ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు- అరెస్ట్ చేస్తుందా?
ED Summons Jharkhand CM: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
ED Summons Jharkhand CM: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నవంబర్ 3న విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించింది.
ED summons J'khand CM Hemant Soren for questioning on Nov 3 in money laundering case linked to alleged illegal mining: officials
— Press Trust of India (@PTI_News) November 2, 2022
గురువారం రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని సమన్లలో స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది.
జులైలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిన ఈడీ పంకజ్ మిశ్రా బ్యాంకు ఖాతాల నుంచి 11.88 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అనంతరం జులై 19న అతడ్ని అరెస్టు చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది.
2019 ఎన్నికల్లో
2019లో జరిగిన ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ కూటమి మొత్తం 47 స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 స్థానాలు ఎక్కువ సాధించింది. ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తోన్న హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఝార్ఖండ్ శాసనసభలో మొత్తం 81స్థానాలు. జేఎంఎం 30 సీట్లలో, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒకచోట గెలుపొందాయి. భాజపా 25, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. 1995 నుంచి జంషెడ్‌పుర్ తూర్పు నుంచి 5 సార్లు ప్రాతినిథ్యం వహించిన ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత రఘుబర్‌దాస్ ఓటమిపాలయ్యారు. రఘుబర్‌దాస్‌పై 8 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు స్వతంత్ర అభ్యర్థి సరయిరాయ్. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనకు భాజపా టికెట్ నిరాకరించినందున తిరుగుబాటు అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓటమిపాలయ్యారు.