Viral News: మాతృభాషలోనే పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్లు, ఎక్కడో తెలుసా?
Prescription in Mother Tongue: కర్ణాటకలో కొందరు వైద్యులు తమ మాతృభాష కన్నడంలోనే పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్. వారి బాటలోనే వందలాది మంది కన్నడ వైద్యులు
Doctors Prescription in Kannada: డాక్టర్లు పేషెంట్లకు అర్థమయ్యేలా క్యాపిటల్ లెటర్స్‌లోనే ప్రిస్క్రిప్షన్ రాయాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 2002లోనే చెప్పింది. కానీ దేశవ్యాప్తంగా అది పాటిస్తున్న వైద్యులు ఎక్కడో కోటికొక్కరు కనిపిస్తారు. ఐతే.. కర్ణాటకలో మాత్రం ఈ వైద్యులు చాలా స్పెషల్. ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్‌లో కాదు.. ఏకంగా కన్నడంలోనే తమ పేషెంట్లకు ఏ ఇబ్బంది లేకుండా కేస్ షీట్లతో పాటు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఆ వైద్యులు ఎవరు.. ? కన్నడిగులు వారి గురించి ఏమంటున్నారో ఈ కథనంలో చూద్దాం..
కర్ణాటకలో ప్రిస్క్రిప్షన్‌ను కన్నడలో రాస్తున్న దంత, ఆర్ధోపెడిక్ వైద్యులు:
భాష.. ఆ ప్రాంత సంస్కృతిని తర్వాతి తరాలకు మోసుకెళ్లే జీవనది అంటారు. ఆ జీవనది విలువ తెలిసిన కన్నడనాట ప్రజలు.. తమ భాషను కాపాడుకోవడానికి ఎంతగానో తపన పడుతుంటారు. అందుకే అక్కడ వీలైనంతగా అన్ని ప్రదేశాల్లో కన్నడ బోర్డులు, కన్నడ భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఉండేలా చూస్తుంటారు. ఇక వైద్య వృత్తి లో కూడా కన్నడాన్ని జొప్పించాలని భాషా మేథావులు ఎప్పటి నుంచో అభ్యర్థిస్తుండగా.. ఆ పని ఇప్పుడు కొందరు వైద్యులు ఆచరణలో పెట్టారు.
చిత్రదుర్గలో సంజయ్ రాఘవేంద్ర అనే ఆర్థోపెడిక్ వైద్యుడు తన పేషెంట్స్‌కు కన్నడలోనే ప్రిస్క్రిప్షన్ రాస్తుంటారు. అది.. సోషల్ మీడియా ద్వారా వైలర్ కావడంతో.. కన్నడ భాషా ప్రేమికులు అలాంటి సంజయ్‌లు మరింత మంది కర్ణాటకలో పుట్టుకురావాలంటూ కామెంట్లు పెట్టారు.
His name is Dr Sanjay he writes prescription in Kannada. Make him famous.
— ಗುಗ್ಗು | GuGGu (@GuGGu_07) September 17, 2024
ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತ್ರೆ ಚೀಟಿ ಬರೆಯುವ ಡಾ. ಸಂಜಯ್ ರನ್ನು ನಾವು ಕನ್ನಡಿಗರೆಲ್ಲ ಹೆಚ್ಚು ಮುನ್ನೆಲೆಗೆ ತರಬೇಕು.#ಕನ್ನಡ #Kannada #Karnataka pic.twitter.com/DugC1EaGAa
హొసన్‌గడికి చెందిన దంత వైద్యుడు మురళీ కూడా సంజయ్ రాఘవేంద్ర మాదిరే తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు పూర్తిగా కన్నడలోనే ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తుంటారు. ఆ ప్రిస్క్రిప్షన్‌ను కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన పురుషోత్తమ్ బిలిమల్ తన X అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
ಹೊಸಂಗಡಿಯ ಡಾ. ಮುರಲಿ ಮೋಹನ್ ಅವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಅಂದವಾಗಿ ಔಷಧ ಚೀಟಿ ಬರೆದಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆ ಹೇಳೋಣ. pic.twitter.com/anUo7zfsh3
— ಪುರುಷೋತ್ತಮ ಬಿಳಿಮಲೆ (@pbilimale) September 18, 2024
గతంలో కర్ణాటక వైద్యశాఖ మంత్రి దినేశ్ గుండురావుకు ఇదే విధమైన అభ్యర్థనను కూడా పురుషోత్తమ్ చేశారు. కన్నడ వైద్యులు అందరూ కన్నడలోనే ప్రిస్క్రిప్షన్ రాయాలని డిమాండ్ చేసిన పురుషోత్తమ్.. ఈ వైద్యుల చర్యను అభినందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు త్వరగా ఈ విధానాన్ని అందిపుచ్చుకుంటే కన్నడ భాషతో పాటు కన్నడ ప్రజలకు కూడా మంచి చేసిన వాళ్లు అవుతుంటారని పురుషోత్తమ్ పలు మార్లు ప్రభుత్వ వైద్యులకు అభ్యర్థన చేశారు. ఈ ఇద్దరు డాక్టర్లు వేసిన బాటలో సాగేందుకు వందల మంది వైద్యులు సిద్ధంగా ఉన్నామంటూ తనకు మెసేజ్‌లు పెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా విధానాన్ని వైద్య మంత్రి దినేశ్ గుండురావు కూడా అప్పట్లో సమర్థించారు. ఐతే.. ప్రాక్టికాలిటీలో ఎదురయ్యే సమస్యలను వైద్యులు సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అభిప్రాయ పడ్డారు.
ప్రిస్క్రిప్షన్ విషయంలో భారతీయ వైద్య మండలి ఏం చెబుతోంది :
ప్రిస్క్రిప్షన్ పూర్తిగా క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలని.. మందుల బ్రాండ్స్ కాకుండా జనరిక్ పేర్లను మాత్రమే ప్రిస్క్రిప్షన్‌లో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా రాయాలని భారతీయ వైద్య మండలి.. 2002లోనే ఆదేశాలు జారీ చేసింది. ఐతే.. దేశవ్యాప్తంగా ఈ రూల్‌ను పాటిస్తున్న వైద్యుల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సుప్రీం కోర్టు కూడా పలుమార్లు ఈ విషయంలో అనేక సూచనలు చేసినా వైద్యులు పెడచెవిన పెడుతూ.. ఎవరికీ అర్థం కానీ గీతల భాషలోనే ప్రిస్క్రిప్షన్‌లు రాస్తూ వస్తున్నారు. పదేళ్ల క్రితమే.. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఈ విషయంపై సత్యమేవ జయతే ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ వైద్యుల్లో మార్పు కనిపించలేదు.
జనరిక్ మెడిసిన్ పేర్లు మాత్రమే రాయాలంటూ 2023లో కూడా సుప్రీం కోర్టు మరోమారు వైద్యులకు సూచించినా బ్రాండ్ల పేర్లతోనే ప్రిస్క్రిప్షన్‌లు వస్తున్నాయి. ఈ కన్నడ వైద్యుల చొరవతో ఐనా.. మాతృభాషలో కాకున్నా.. కనీసం అర్థమయ్యేలా అయినా ఇంగ్లీష్‌లో ప్రిస్క్రిప్షన్ రాయాలని ప్రజలు కోరుకుంటున్నారు.