Anganwadis Protest: సంక్రాంతి వేళ రోడ్లపైనే అంగన్ వాడీలు, జగన్ ఇంట్లో మాత్రం పండుగ - సీపీఐ రామకృష్ణ
K Ramakrishna Comments: రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డే అని కె రామకృష్ణ విమర్శించారు.
CPI State Secretary K Ramakrishna: అంగన్వాడీలకు తానిచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డే అని విమర్శించారు. సంక్రాంతి వేళ (జనవరి 15) కె రామకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. ఇచ్చిన మాట అమలు చేసి ఉంటే అంగన్వాడీలు రోడ్డేక్కేవారా? అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపటం లేదని ప్రశ్నించారు. జగన్ మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి తాను పండుగ చేసుకుంటూ, అంగన్వాడీలను వీధులపాలు చేశారని కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కుటుంబాల ఉసురు జగన్ సర్కారుకు తగిలి తీరుతుందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న అంగన్ వాడీల సమ్మె
తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె కొనసాగుతూనే ఉంది. విజయవాడ ధర్నా చౌక్‌లో వారు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నిరసనలు ఆగడం లేదు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో అంగన్ వాడీలు వినూత్న రీతిలో నిరసన చేస్తున్నారు. అంగన్ వాడీలు రోడ్డుపైనే సంక్రాంతి ముగ్గులు వేసి పొంగలి పెట్టుకుంటున్నారు. జీతాలు పెంచే వరకూ పోరాడతామని నినాదాలు చేశారు. జీతాల పెరుగుదల, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాడతామని అంగన్ వాడీ సిబ్బంది తేల్చి చెప్పారు.