AP Minister Ushasri Charan: మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
AP Minister Ushasri Charan: మంత్రి ఉషశ్రీ చరణ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. 2017 నాటి కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ వారెంట్ ను జారీ చేసింది.
AP Minister Ushasri Charan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కు కళ్యాణ దుర్గం కోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఈ మేరకు కోర్టు మంత్రికి షాకిచ్చింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉషశ్రీ చరణ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని 2017 ఫిబ్రవరి 27వ తేదీన బ్రహ్మ సముద్ర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారని అప్పటి తహసీల్దార్ డి. వి. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మరో ఏడుగురిపై 188 సెక్షన్ కింద కేసు కూడా నమోదు అయింది. అయితే ఈ కేసును కళ్యాణ దుర్గం న్యాయస్థానం విచారిస్తోంది. బుధవారం విచారణకు రావాల్సిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ హాజరు కాకపోవడంతో మంత్రితో పాటు మరో ఏడుగురిపై కళ్యాణ దుర్గం జూనియర్ సివిల్ జడ్జీ సుబాన్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ పై మంత్రి స్పందించాల్సి ఉంది.
ఉషశ్రీ చరణ్ 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనూహ్యంగా రెండో విడత ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. నియోజకవర్గంలోనూ ఉషశ్రీ చరణ్ బాగా యాక్టివ్ గా ఉంటారు. తరచూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ మంత్రి ఉషశ్రీ చరణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఆగస్టు 15వ తేదీన ఉషశ్రీ చరణ్ ఆమె గన్ మెన్ లు తిరుపతిలో హల్ చల్ చేశారు. ఆగస్టు 15 కాబట్టి.. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వీకెండ్ కావడం వరుసగా సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అయితే సెలవు దినాల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తుంటుందని టీటీడీ. ఆరోజూ అలాగే వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అయితే అదే సమయంలో తిరుమలకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ హల్ చల్ చేశారు. 50 మంది అనుచరులతో తిరుమలకు వచ్చిన మంత్రి అంతమందితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 10 మందికి సుప్రభాతం టికెట్లు ఇప్పించారు. వీఐపీ దర్శనం రద్దు చేసిన వేళ మంత్రి అనుచరులు, గన్ మెన్లు హల్ చల్ చేయడంపై ప్రశ్నించిన మీడియాపైనా వారు దురుసుగా ప్రవర్తించారు. వీడియో జర్నలిస్టును నెట్టేశారు. మంత్రి కావడంతోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా, టీటీడీ అధికారులు వారికి టికెట్లు జారీ చేశారని, కానీ టీటీడీ వారికి సామాన్య భక్తుల కష్టాలు పట్టవని భక్తులు మండిపడ్డారు. మంత్రి ఉషశ్రీ చరణ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.