Jairam Ramesh on BJP: ఎన్నికలొచ్చినప్పుడే బీజేపీకి యూసీసీ గుర్తొస్తుంది, లా కమిషన్ ఏం చెప్పిందో తెలుసుగా - జైరాం రమేశ్
Uniform Civil Code: ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి యూసీసీ గుర్తుకొస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
Jairam Ramesh on UCC:
బీజేపీపై విమర్శలు..
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీకి యూసీసీ (Uniform Civil Code) గుర్తుకు వస్తుందని అన్నారు. భారత్ జోడో యాత్ర కేవలం ఓ కార్యక్రమం కాదని, అదో ఉద్యమం అని తేల్చి చెప్పారు. "ఎన్నికల సమయం రాగానే బీజేపీకి యూసీసీ గుర్తుకొస్తుంది. ఈ సారి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కారణంగా ఆ చర్చను తెరపైకి తీసుకొచ్చారు" అని మండి పడ్డారు. పార్లమెంట్‌లోనూ తాను ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. "జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ 2018 ఆగస్టు 31న 185 పేజీలతో కూడిన ఓ రిపోర్ట్ రూపొందించింది. కామన్ సివిల్ కోడ్ మనకు అవసరమే లేదని తేల్చి చెప్పింది" అని వివరించారు. ఇప్పటికే గుజరాత్‌లో యూసీసీ అమలు కోసం కమిటీ ఏర్పాటు కాగా...ఇటీవలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
అమలు చేసి తీరతాం..
గుజరాత్ ఎన్నికలను ప్రభావితం చేయనున్న అంశాల్లో యూసీసీ (Uniform Civil Code) కూడా ఒకటి. ఇప్పటికే అమిత్‌షా ఎన్నో సందర్భాల్లో దీనిపై స్పష్టతనిచ్చారు. కచ్చితంగా అమలు చేసి తీరతామని తేల్చి చెప్పారు. ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దీనిపై స్పందించారు. ABP Newsకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నారు. అన్ని రాష్ట్రాలూ ఈ కోడ్‌ను అమలు చేసే ఆలోచన చేయాలని సూచించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఇటీవల యూసీసీ (Uniform Civil Code) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడ్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే...అంత కన్నా చర్చలు, వాదనలు తప్పకుండా వింటామని అన్నారు. జనసంఘ్‌గా ఉన్న నాటి నుంచే బీజేపీ ఈ హామీ ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. "బీజేపీ మాత్రమే కాదు. ఎప్పుడో మన రాజ్యాంగ పరిషత్ కూడా యూసీసీని సరైన సమయంలో అమలు చేయొచ్చని సూచించింది. సెక్యులర్ దేశంలో మతాల ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని చెప్పింది. రాష్ట్రాలన్నీ సెక్యులర్‌గా మారిపోతే అప్పుడు మతాల ఆధారంగా చట్టాల అవసరం ఎందుకు.." అని అన్నారు అమిత్‌షా. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ చేసిన సూచనలు కాలక్రమంగా మరుగున పడిపోయాయని చెప్పారు.
యూసీసీ అంటే ఇదే..
సాధారణంగా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఆయా మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను అనుసరిస్తుంటారు. హిజాబ్, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు ఈ కోవకు వస్తాయి. అయితే...Uniform Civil Code అమలు చేస్తే అన్ని మతాలు, వర్గాలకు ఒకే చట్టం అమలవుతుంది. అంటే...అందరికీ కలిపి ఉమ్మడి చట్టం. మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందన్నది కొందరి వాదన. ఈ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ఏళ్లుగా నలుగుతున్న కేసులకూ వెంటనే పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read: NOTA Temple Gujarat: ఎన్నికల వేళ గుజరాత్‌లో వెలసిన 'నోటా' ఆలయం!