Xi Jinping Third Term: వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్- ఈ సారి టార్గెట్ తైవాన్!
Xi Jinping Third Term: జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
Xi Jinping Third Term: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టి చరిత్ర సృష్టించనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మరో ఐదేళ్లకు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 2,296 మందికిపైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అక్టోబర్ 16 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
తైవాన్
ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని జిన్‌పింగ్ అన్నారు.
తైవాన్‌ను స్వతంత్ర ప్రాంతంగా తాము అంగీకరించబోమని అది తమ అంతర్గత ప్రాంతమని చైనా చెబుతూ వస్తోంది. అయితే ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ, ఇతర చట్ట సభ్యులు తైనాన్‌లో పర్యటించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
శక్తిమంతమైన నేత
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎలాంటి శక్తిమంతమైన నేతగా పేరుపొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుసైగలతో డ్రాగన్ దేశాన్ని నడిపించిన కమ్యూనిస్ట్ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ అరుదైన ఘనత సాధిస్తారు.
ఈ సదస్సును కఠినమైన కొవిడ్ నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రెండు రోజుల పాటు కొవిడ్ బబుల్‌లో ఉండాలి.
సంచలన వార్తలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియా సహా ప్రధాన మీడియా ఛానళ్లలో ఇటీవల వార్తలు రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. దేశం మొత్తాన్ని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) తన చేతుల్లోకి తీసుకున్నట్లు వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడంతో వెంటనే ఈ న్యూస్ వైరల్ అయింది.
అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని తర్వాత తేలింది. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు వెళ్లి సెప్టెంబర్ 16న తిరిగి చైనా వచ్చారు జిన్‌పింగ్. అయితే ఆ తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఆయన కనిపించకపోయేసరికి సోషల్ మీడియాలో వివిధ వార్తలు వచ్చాయి.
Also Read: Russia Shooting: రష్యా సైనికులపై కాల్పులు- 11 మంది మృతి, 15 మందికి గాయాలు!