China Lockdown: చైనాలో మళ్లీ లాక్‌డౌన్! వద్దు బాబోయ్ అంటున్న ప్రజలు - ఇదీ సంగతి
China Lockdown:చైనాలో ఫ్లూ కేసులు పెరుగుతుండటం వల్ల మరోసారి లాక్‌డౌన్ విధించాలని చూస్తున్నారు.
China Lockdown:
పెరుగుతున్న ఫ్లూ కేసులు
చైనాలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయి. ఈ మధ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పుడు మరో వైరస్ దాడి చేస్తోంది. ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాప్తిని తగ్గించేందుకు మళ్లీ లాక్‌డౌన్ విధించడమే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రజలు మాత్రం ఇందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే కరోనా ఆంక్షలతో వాళ్లంతా విసిగిపోయారు. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ అనే ఆలోచన చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం ఆంక్షలకు సిద్ధమవుతోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఎక్కడైతే ఎక్కువగా వ్యాప్తి ఉందో...అక్కడ లాక్‌డౌన్ విధించాలని చూస్తోంది. అంతే కాదు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకూ చర్యలు తీసుకోనుంది. కొద్ది రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలనూ రద్దు చేయనుంది. షాపింగ్ మాల్స్, థియేటర్లు, లైబ్రరీలు, పర్యాటక ప్రదేశాలనూ మూసేయాలనే ఆలోచన చేస్తోంది. ఇక స్కూల్స్, నర్సరీలను మూసి వేస్తారని తెలుస్తోంది. జియాన్ అనే సిటీలో దాదాపు కోటి 30 లక్షల జనాభా ఉంది. చైనాలో ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కూడా. ఈ ప్రాంతంలో ఆంక్షలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ సిటీ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. లాక్‌డౌన్ విధించే బదులు అందరికీ వ్యాక్సిన్‌లు ఇస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి వార్తలతో తాము భయపడేది లేదని,ఇప్పటికే వేసారిపోయామని అంటున్నారు. అటు ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో పాటు మరో సమస్య కూడా చైనాను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎక్కడా మందులు దొరకడం లేదు. ఫార్మసీలు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నాయి.
రూల్ సవరించనున్న అమెరికా..
చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు చేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని చూస్తోంది అమెరికా. చైనాలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాలు పెద్దగా నమోదు కాకపోవడం లాంటి పరిణామాలను గమనించిన బైడెన్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు Associated Press రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 28న అమెరికా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చింది. అప్పటికి చైనాలో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరిగాయి. హాస్పిటల్స్‌లో చోటు లేక బాధితులు పాట్లు పడ్డారు. మృతుల సంఖ్య కూడా దారుణంగా పెరిగింది. శవాలను దహనం చేసేందుకూ అవకాశం లేక రోజుల తరబడి వాటిని అలాగే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా...చైనా మాత్రం కొవిడ్ బాధితుల లెక్కలు ప్రపంచానికి వెల్లడించలేదు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలోనే అమెరికా చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అమెరికాలోని విమానాశ్రయాల్లో నిఘా పెట్టారు. చైనా నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికీ కరోనా టెస్ట్ చేశారు. ఫ్లైట్‌లలోని మల మూత్రాలనూ పరీక్షించారు. Genomic Surveillance Programలో భాగంగా...చైనాతో సహా 30 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించింది అమెరికా యంత్రాంగం.
Also Read: AAP Vs BJP: ప్రతిపక్షాలపై అటాక్ పూర్తయ్యాక ప్రశాంతంగా నిద్రపోండి, ప్రధానిపై ఆప్ ఎంపీ సెటైర్