CBI Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్..
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు.. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు.. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈరోజు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 30లోగా వారెంట్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది.
జగన్, విజయ సాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఆయనపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్ చేసింది. వాన్‌పిక్ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి సైతం ఈరోజు కోర్టు విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు గతంలో వీరిద్దరికీ మినహాయింపు ఇచ్చింది. వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులు ఇస్తామని కోర్టు వెల్లడించింది.
Also Read: AP News: హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు షాక్.. ఉచిత వసతి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ సీఎం జగన్ , ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు ఇటీవల కొట్టేసింది. వారు బెయిల్ షరుతులు ఉల్లంఘించారన్న రఘురామకృష్ణరాజు వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. రాజకీయ ఉద్దేశాలతోనే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారన్న జగన్ లాయర్ల వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఆ పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు తెలిపింది. దీంతో సీఎం జగన్, విజయ సాయిరెడ్డిలకు ఊరట లభించింది.
Also Read: AP News: ఏపీలో మరింత సులభంగా రిజిస్ట్రేషన్లు.. సచివాలయాల్లోనే ప్రక్రియ..
2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ క్విడ్ ప్రో కో పేరుతో తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకుని లబ్ది చేకూర్చాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది. 2011 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ కేసులపై 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేయగా... దీని ఆధారంగా ఈడీ 9 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్ 2న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి జగన్ షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్నారు