AP News: హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు షాక్.. ఉచిత వసతి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన సచివాలయ, శాసన పరిషత్, హెచ్ఓడీ విభాగాలకు చెందిన మహిళా, పురుష ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేయాలని సర్కార్ నిర్ణయించింది.
హైదరాబాద్ నుంచి ఏపీకి తాత్కాలికంగా తరలివచ్చిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీకి తరలివచ్చిన సచివాలయ, శాసన పరిషత్, హెచ్ఓడీ విభాగాలకు చెందిన మహిళా, పురుష ఉద్యోగులకు నవంబర్ 1వ తేదీ నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక ఉచిత వసతిలో ఉంటున్న ఉద్యోగులు నవంబర్ 1వ తేదీ తర్వాత నుంచి ఎవరి వసతి వారు సొంత ఖర్చులతో భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉద్యోగులకు అందించే ఉచిత ట్రాన్సిట్ వసతిని 2021 అక్టోబరు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. వచ్చే నెల 31 తర్వాత దీనిని నిలిపివేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏపీ రాజధానిని అమరావతికి తరలించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు విజయవాడలోని తాత్కాలిక రాజధానికి తరలివచ్చారు. ఆ సమయంలో విధి నిర్వహణలో వారు పలు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి.. సచివాలయ శాఖల ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు తాత్కాలిక వసతి కల్పిస్తామని చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వీరికి వసతి సౌకర్యం కల్పించారు. వీరి వసతికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఉద్యోగులకు ఉచిత వసతిని కొన్నేళ్ల పాటు కొనసాగించింది. తాజాగా దీనిని నిలిపివేస్తూ... జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: AP Govt One Lakh Fine: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. రూ.లక్ష జరిమానా విధింపు...