AP DGP On Heroin Seize: ఆ హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదు... ఏపీ డీజీపీ కీలక ప్రకటన... వాస్తవాలు మాట్లాడాలని నేతలకు హితవు
గుజరాత్ లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్న హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదని డీజీపీ తెలిపారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గుజరాత్ ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్ తో విజయవాడకు సంబంధం లేదని ఏపీ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు విజయవాడకు సంబంధం లేదని ప్రకటన జారీచేశారు. అయినా ఈ విషయంపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లు సైతం ఈ అంశంపై పలు కథనాలను ప్రచురిస్తూ దిల్లీ, నోయిడా, చెన్నై, ముంద్రాలలో స్వాధీనాలు, అరెస్టుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారన్నారు. నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ లో లేవన్న విషయాన్ని డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, పత్రికలు ధృవీకరిస్తున్నా.. రాజకీయ నేతలు అపోహలు సృష్టించడం భావ్యం కాదని డీజీపీ కార్యాలయం తెలిపింది.
Also Read: AP Drugs : రూ.9వేల కోట్ల హెరాయిన్ వెనుక అసలు కథేంటి ? కింగ్ పిన్ ఎవరో ఎలా తేలుతుంది ?
ఏపీలో వారి కార్యక్రమాలు లేవు
ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉందని, వారి కార్యకలాపాలు ఏపీలో జరగడంలేదని డీజీపీ తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే డీఆర్ఐ అధికారులు, కేంద్ర సంస్థలు ధ్రువీకరించాయన్నారు. హెరాయిన్ ను విజయవాడకి కానీ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అఫ్గనిస్థాన్ నుంచి ముంద్రా పోర్టుకు కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకునే క్రమంలో పట్టుకున్నారని మాత్రమే డీఆర్ఐ అధికారులు పేర్కొంటున్నారని గుర్తుచేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని డీజీపీ అన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దంటూ హితవు పలికారు. వాస్తవాలను పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడం వలన ప్రజలలో అపోహలు కలగడమే కాకుండా వారు అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదముందని డీజీపీ తెలిపారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు కచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు బేరీజు వేసి మాట్లాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని డీజీపీ అభిప్రాయపడ్డారు.