AP News: ఏపీలో మరింత సులభంగా రిజిస్ట్రేషన్లు.. సచివాలయాల్లోనే ప్రక్రియ..
భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఏపీలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభంపై దృష్టి సారించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సచివాలయంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ల అంశంపై లోతుగా చర్చించారు. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో సర్కార్ పలు చర్యలు తీసుకుందని రజత్ భార్గవ వెల్లడించారు.
Also Read: TTD Updates: శ్రీవారి దర్శనం కోసం అలా వెళ్తే మోసపోవడమే! ఇలా చేస్తే చాలా సేఫ్
పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవడంతో..
రిజిస్ట్రేషన్ శాఖ సేవలను వేగిరం చేసే క్రమంలో భాగంగా.. గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలకు శ్రీకారం చుడుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని రజత్ భార్గవ తెలిపారు. ఇది విజయవంతం కావడంతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల సమన్వయంతో రీసర్వే ప్రాజెక్ట్ ఫేజ్ -1 పరిధిలోని 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 51 గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూములు, ఆస్తుల రిజిస్టేషన్ల ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు.. సచివాలయ కార్యదర్శులకు పూర్తి స్థాయి శిక్షణ అందించాలని రజత్ భార్గవ తెలిపారు. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని క్రమేణా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.