CAA ముస్లింలకు వ్యతిరేకం కాదు, వెనక్కి తీసుకునే అవకాశమే లేదు - అమిత్ షా
Citizenship Amendment Act: సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు
Amit Shah on CAA: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదాస్పదమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే...దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముస్లిం వ్యతిరేక చట్టం అంటూ మండి పడుతున్నాయి. ఈ విమర్శలకు హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. CAA ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాయని మండి పడ్డారు. ఇప్పటికే చాలా సార్లు ఈ చట్టం గురించి మాట్లాడానని, దేశంలోని మైనార్టీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ఉద్దేశమని వివరించారు.
"ఇప్పటికే నేను పౌరసత్వ సవరణ చట్టం గురించి 41 సార్లు మాట్లాడాను. అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రస్తావించాను. దేశంలోని మైనార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ల హక్కుల్ని అణిచివేసే విధంగా చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పిస్తాం. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లలో హింసకు గురైన శరణార్థులు 2014 డిసెంబర్ 31 వ తేదీ కన్నా ముందు భారత్‌కి వచ్చిన వాళ్లకే ఈ చట్టం వర్తిస్తుంది"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
#WATCH | On opposition leaders saying they will repeal CAA if INDIA alliance comes to power in 2024, Union Home Minister Amit Shah says, "They also know that INDI alliance will not come to power. CAA has been brought by BJP govt led by PM Modi. It is impossible to repeal CAA…It… pic.twitter.com/o275o5a3hN
— ANI (@ANI) March 14, 2024
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముస్లింలు కూడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు అమిత్ షా. అయితే...చట్టంలో పేర్కొన్న విధంగా ఆ మూడు దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించాలన్నదే ముఖ్య లక్ష్యం అని వెల్లడించారు. ఒకవేళ ఆందోళనలు మళ్లీ చెలరేగితే CAA చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకి గట్టి బదులిచ్చారు అమిత్ షా. వెనక్కి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
"తాము అధికారంలోకి రాగానే CAAని రద్దు చేస్తాం అని ఇండియా కూటమి చెబుతోంది. వాళ్లు అధికారంలోకి రారని వాళ్లకీ తెలుసు. CAAని బీజేపీయే తీసుకొచ్చింది. నరేంద్ర మోదీ చొరవతోనే ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దేశవ్యాప్తంగా ఈ చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి