Kailash Vijayvargiya: అమ్మాయిలందరూ శూర్పణకల్లా తయారవుతున్నారు, మంచి దుస్తులు వేసుకోలేరా? - బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Kailash Vijayvargiya: మహిళల వస్త్ర ధారణపై బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Kailash Vijayvargiya:
కైలాశ్ విజయ్‌వర్గియ కామెంట్స్..
బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గియ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్ర ధారణ గురించి మాట్లాడుతూ అందరినీ శూర్పణఖతో పోల్చారు. ఈ రోజుల్లో మహిళలందరూ శూర్పణకల్లా తయారవుతున్నారని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హనుమత్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు కైలాశ్. మహిళల్లో దేవతా రూపమే కనిపించడం లేదని, వాళ్ల వస్త్రధారణ అలా తయారైందని అన్నారు. మహిళలు, పురుషులు కలిసి డ్యాన్స్ చేయడాన్నీ తప్పుబట్టారు. వాళ్లను కొట్టాలన్నంత కోపం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అబ్బాయిలు,అమ్మాయిలు కలిసి పిచ్చిగా డ్యాన్స్‌లు వేస్తున్నారు. అలాంటి వాళ్లను కనీసం ఐదారుసార్లు కొడితే గానీ వాళ్లకున్న ఆ పిచ్చి దిగిపోదు. నన్ను నమ్మండి. హనుమంతుడిపైన ప్రమాణం చేసి చెబుతున్నాను. అమ్మాయిల డ్రెసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. వాళ్లను చూస్తుంటే ఏ దేవతా గుర్తు రావడం లేదు. వాళ్లలో ఆ దైవత్వాన్ని చూడలేకపోతున్నాం. వాళ్లు శూర్పణకలా తయారవుతున్నారు. దేవుడు వాళ్లకు మంచి శరీరం ఇచ్చాడు. కనీసం మంచి బట్టలు వేసుకోలేరా?"
- కైలాశ్ విజయ్‌వర్గియ, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ
Senior BJP leader Kailash Vijayvargiya “ We see goddess in women. But (with) the kind of bad dresses the girls wear and move around, they do not embody goddess but look like Shurpanakha. God has given you good and beautiful body.....dress well, friends." pic.twitter.com/IWXvw7S0cK
— Anurag Dwary (@Anurag_Dwary) April 8, 2023
యువత గంజాయికి అలవాటు పడడాన్ని వ్యతిరేకించారు కైలాశ్. ఈ క్రమంలోనే అమ్మాయిల డ్రెసింగ్‌పై కామెంట్స్ చేశారు. దీనిపై మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. వాళ్లకు నచ్చిన దుస్తులు వేసుకుంటారంటూ తేల్చి చెబుతున్నాయి. ఇప్పుడే కాదు. గతంలోనూ కైలాశ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఆగస్టులో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు చేశారు. విదేశాల్లో మహిళలు బాయ్‌ఫ్రెండ్‌లను మార్చినట్టుగా...ఆర్‌జేడీ తన మిత్ర పక్షాలను మార్చేస్తోందని అన్నారు.
"నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఒకరు ఓ విషయం చెప్పారు. అక్కడి మహిళలు పదేపదే బాయ్‌ఫ్రెండ్‌లను మార్చేస్తుంటారట. బిహార్ ముఖ్యమంత్రి కూడా ఇంతే. ఎప్పుడు ఎవరితో మైత్రి పెట్టుకుంటారో, ఎప్పుడు ఎవరిని వదిలేస్తారో తెలియదు'
- కైలాశ్ విజయ్‌వర్గియ, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ
రేణుకా చౌదరి అసహనం...
రాహుల్‌పై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఈ నిర్ణయాన్ని ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరువు నష్టం దావా వేయనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఇందుకు కారణమేంటో కూడా వివరించారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ తనను రామాయణంలోని శూర్పణఖతో పోల్చారని చెప్పారు. ట్విటర్‌లో ఈ విషయం వెల్లడించారు. 2018లో పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోని షేర్ చేశారు. "రేణుకా చౌదరి నవ్వుని చూస్తే నాకు రామాయణంలోని ఓ పాత్ర గుర్తుకొస్తోంది" అంటూ మోదీ కామెంట్ చేసిన వీడియో పోస్ట్ చేశారు.
"అధికార దాహంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా నన్ను శూర్పణఖతో పోల్చుతూ కించపరిచారు. ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నాను. చూద్దాం. కోర్టులు ఎంత త్వరగా స్పందిస్తాయో"
- రేణుకా చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేత
Also Read: Sharad Pawar: అదానీ వ్యవహారంపై విచారణ అనవసరం, ఆ కమిటీలో అంతా బీజేపీ వాళ్లే - శరద్ పవార్