(Source: ECI/ABP News/ABP Majha)
Badruddin Ajmal: హిందూ వివాహాలపై నోరు జారిన ఎంపీ, నా ఉద్దేశం అది కాదంటూ క్షమాపణలు
Badruddin Ajmal: హిందూ వివాహాలపై ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Badruddin Ajmal Statement:
బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలపై వివాదం
ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు, అసోం ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా ముస్లింల విధానాన్ని అనుసరించి యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవాలని అన్నారు. "ముస్లింలలో పురుషులు 20-22 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు. మహిళలు కూడా మేజర్ కాగానే 18 ఏళ్లకు వివాహం చేసుకుంటారు. హిందువులు మాత్రం పెళ్లికి ముందే ఇద్దరి ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్లు పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. విలాసంగా గడుపుతారు. డబ్బు దాచుకుంటారు" అని చేసిన
వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్స్ అక్కడితో ఆగలేదు. "హిందువులు 40 ఏళ్లు దాటాక తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకుంటారు. ఆ వయసులో పిల్లల్ని కని ఎలా పెంచగలరు..?" అని అన్నారు. కాస్త అభ్యంతరకరంగానూ మాట్లాడారు. దీనిపై హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లవ్ జిహాద్ (Love Jihad)పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అజ్మల్. శ్రద్ధా హత్య కేసుపై మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ సీఎం హిమత శర్మ ఇది "లవ్ జీహాద్" అని మండి పడ్డారు. దీనిపై స్పందిస్తూ.."భారత్‌లో టాప్ లీడర్స్‌లో హిమంత ఒకరు. మీరు కూడా లవ్ జీహాద్‌కు పాల్పడొచ్చు కదా. మిమ్మల్ని ఎవరాపుతారు..? మా ముస్లిం యువతులను తీసుకెళ్లండి. మేం ఎలాంటి గొడవ చేయం. మీ శక్తేంటో కూడా మాకు తెలుస్తుంది" అని నోరు జారారు. వక్ఫ్ బోర్డ్ పరిధిలోని కాలేజీల్లోకి కేవలం ముస్లిం యువతులకే కాకుండా...హిందూ యువతులూ చదువుకునేందుకు అనుమతినివ్వాలని అన్నారు.
#WATCH | Hindus should follow the Muslim formula of getting their girls married at 18-20 years, says AIUDF President & MP, Badruddin Ajmal. pic.twitter.com/QXIMrFu7g8
— ANI (@ANI) December 2, 2022
దీనిపై దుమారం రేగుతున్న క్రమంలోనే...అజ్మల్ స్పందించారు. లవ్ జీహాద్, హిందు వివాహాలపై చేసిన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. "నా వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతీసి ఉంటే, వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటున్నాను. మైనార్టీలకు న్యాయం చేయాలన్నదే నా ఉద్దేశం. వారికీ విద్య, ఉద్యోగాలు కల్పించాలి" అని అన్నారు.
పరేష్ రావల్ కామెంట్స్..
రాజకీయ నాయకులు ఇలా నోరు జారడం, తరవాత సారీ చెప్పడం కొత్తేం కాదు. ఇటీవలే బీజేపీ నేత, సినీ నటుడు పరేష్ రావల్ రోహింగ్యా ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. "అందరూ గ్యాస్ సిలిండర్‌ల ధర పెరిగిపోయిందని వాపోతున్నారు. త్వరలోనే ఆ ధరలు తగ్గుతాయి. ఉద్యోగాలూ వస్తాయి. కానీ...ఒకటి ఆలోచించండి. రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ పౌరులు వచ్చి మీతో పాటు ఉంటే మీకెలా ఉంటుంది..? ఇప్పటికే ఈ పరిస్థితులు ఢిల్లీలో చూస్తున్నాం. తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్‌లు వస్తే కొనుక్కోవచ్చేమో. కానీ..వాటితో ఏం చేస్తారు..? బెంగాలీల కోసం చేపలు వండుతూ కూర్చుంటారా..?" అని వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు పరేష్ రావల్. అంతే కాదు. గుజరాత్ ప్రజలు ద్రవ్యోల్బణాన్నైనా సహిస్తారేమో కానీ...ఇలా బంగ్లాదేశ్ ప్రజలు వచ్చి తమతో పాటు నివసిస్తే ఊరుకోరని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలపైనా కాస్త ఘాటుగా స్పందించారు. "వాళ్ల నోళ్లకు డైపర్‌లు వేసుకోవాలి. అలా మాట్లాడుతున్నారు" అని నోరు జారారు. ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు బీజేపీపై భగ్గుమన్నాయి.
Also Read: పెళ్లికి ముందే శృంగారం ఘోరమైన నేరం, జైలు శిక్ష తప్పదు- కొత్త క్రిమినల్ కోడ్