Ashok Gehlot vs Sachin Pilot: అతనో మోసగాడు, సీఎం పదవికి అనర్హుడు - సచిన్ పైలట్‌పై గహ్లోట్ డైరెక్ట్ అటాక్
Ashok Gehlot vs Sachin Pilot: సచిన్ పైలట్‌పై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ నిప్పులు చెరిగారు.
Ashok Gehlot vs Sachin Pilot:
పైలట్‌పై గుర్రు..
రాజస్థాన్ రాజకీయాలు మరింత ముదిరినట్టే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఇండైరెక్ట్‌గా అటాక్ చేసుకున్న అశోక్ గహ్లోట్, సచిన్ పైలట్..ఇప్పుడు డైరెక్ట్ అటాక్‌కు సిద్ధమైపోయారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్..సచిన్ పైలట్‌పై విరుచుకు పడ్డారు. "మోసగాడు" అంటూ పదేపదే పైలట్‌ను ఉద్దేశిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. "ఓ మోసగాడు ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు" అని నిప్పులు చెరిగారు. "పార్టీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎం చేయలేదు. ఆయనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదు. ఆయన పార్టీకి నమ్మకద్రోహం చేశారు. అతనో మోసగాడు" అని విమర్శించారు. ఓ పార్టీ అధ్యక్షుడే తమ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు ప్రయత్నించడం దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో సచిన్ పైలట్...సీఎం పదవి కోసం గహ్లోట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. ఆ అంశాన్నే ప్రస్తావిస్తూ గహ్లోట్ అసహనం వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం బీజేపీయేనని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు బీజేపీ పెద్దలు ఈ కుట్ర వెనక ఉన్నారని అన్నారు. "అమిత్‌షా, ధర్మేంద్ర ప్రదాన్ ఈ కుట్రలో చేతులు కలిపారు. పైలట్‌తో కలిసి ఢిల్లీలో ఓ సారి మీటింగ్ కూడా పెట్టుకున్నారు" అని చెప్పారు గహ్లోట్.
అంతే కాదు. పైలట్ వైపు మళ్లేందుకు ఒక్కో ఎమ్మెల్యేకూ ఢిల్లీ ఆఫీస్‌లో రూ.10 కోట్లు ఇచ్చారని, మరి కొందరికి రూ.5 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు. గాంధీ కుటుంబం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని స్పష్టం చేశారు. సచిన్‌పైలట్‌తో విభేదాలు ఎందుకు అన్న ప్రశ్నకూ వివరణ ఇచ్చారు గహ్లోట్. "2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు సచిన్ పైలట్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానానికి చెప్పింది నేనే. ఉన్నట్టుండి ఆయన ఎందుకలా మారిపోయారో అంతుపట్టడం లేదు" అని చెప్పారు.
గుజరాత్ ఎన్నికల తరవాతే..
రాజస్థాన్ కాంగ్రెస్‌లో విభేదాలను తగ్గించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. కానీ..అవి ఓ కొలిక్కి రావడం లేదు. కనీసం ఖర్గే అయినా..ఈ బాధ్యత తీసుకుంటారనుకుంటే..ఆయనా సైలెంట్ అయిపోయారు. రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర వచ్చే నెల రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ఆ సమయంలోనే..రాహుల్ తమ సమస్యలు పరిష్కరించాలని భావిస్తోంది రాష్ట్ర క్యాడర్. డిప్యుటీ సీఎం సచిన్ పైలట్ కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి తెలియజేశారు. "ఏదో ఓ స్పష్టత ఇవ్వండి" అంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోని సమస్యలు తీర్చకుండా జోడో యాత్ర కొనసాగించటం సరికాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కీలక విషయం వెల్లడించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరవాతే రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని డీల్ చేస్తామని తెలిపింది.
Also Read: Mumbai civic body poll: ఉద్ధవ్ సేనకు బూస్ట్ ఇచ్చే న్యూస్- ముంబయి వచ్చేందుకు తేజస్వీ సై!