Family Planning: కుటుంబ నియంత్రణ ఆడాళ్లకే పరిమితమా? పురుషులు ఎందుకు చేయించుకోరు?
Family Planning: వ్యాసెక్టమీ చేయించుకోవటంపై పురుషులకు ఉన్న భయాలు, అపోహల వల్ల స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తోంది.
Why Men Hesitate on Vasectomy:
ఇది స్త్రీల బాధ్యత అయిపోయిందా..?
కుటుంబ నియంత్రణ (Family Planning) మహిళలకేనా...? ఏం..మగాళ్లు మాత్రం ఆ ఆపరేషన్ చేయించుకోకూడదా..? ఇది ఇప్పటి వాదన కాదు. ఎన్నో దశాబ్దాలుగా కొందరు ఈ సమస్యపై గట్టిగానే మాట్లాడుతున్నారు. పోట్లాడుతున్నారు. ప్రాక్టికల్‌గా ఏం జరుగుతోందన్నది పక్కన పెడితే కనీసం చర్చ అయితే వినిపిస్తోంది. కానీ...చివరకు ఎప్పుడూ జరిగేదే జరుగుతోంది. రెండో సంతానం కలగగానే మహిళలకు సీ సెక్షన్‌తో పాటు ట్యూబెక్టమీ (Tubectomy) ఆపరేషన్ చేస్తున్నారు. "పనిలో పని..అదీ అయిపోతుందిలే ఏముంది" అని అంతా దాన్ని లైట్ తీస్కుంటున్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేవలం "స్త్రీల బాధ్యత" అన్నట్టుగా మారిపోయింది. మగాళ్లూ వ్యాసెక్టమీ (Vasectomy)ఆపరేషన్ చేయించు కునే వీలున్నా...అందుకు ముందుకు రారు. ఏదో జరిగిపోతుందేమోనన్న భయం, రకరకాల అపోహలతో పాటు..."మగాళ్లకెందుకీ తిప్పలు" అనే ఆలోచన...కుటుంబ నియంత్రణను కేవలం ఆడాళ్లకే పరిమితం చేసింది. ఫలితంగానే...కాంప్లికేషన్ల్ ఉంటాయని తెలిసినా, ఇష్టమున్నా లేకపోయినా...ఆడాళ్ల కన్సర్న్ అడగకుండానే డెలివరీ అయిన వెంటనే కు.ని. ఆపరేషన్ చేసేస్తున్నారు. ఇలాంటప్పుడే కొన్ని సార్లు దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో జరిగింది ఇదే. వైద్యంలో ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వస్తున్నా.. ఇంకా ఇలాంటి ఆపరేషన్లు చేయటంలో నిర్లక్ష్యమేంటో అర్థం కాదు. ఆపరేషన్ చేస్తే...ఇన్‌ఫెక్షన్ సోకి మహిళలు మృతి చెందటానికి మించిన దారుణం ఇంకేమైనా ఉంటుందా..?
భయాలు, అపోహలు..
పెద్ద ఆసుపత్రుల్లో ట్యూబెక్టమీ ఆపరేషన్ థియేటర్ల ముందు మహిళలు వరుస కట్టి కూర్చుంటారు. అదే వ్యాసెక్టమీ థియేటర్ల బయట ఒక్క పురుషుడూ కనిపించడు. ఇదేదో అతి చేసే చెప్పే విషయం కాదు. కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కనిపించే నిజం. ఆ మధ్య హెల్త్ అండ్ సర్వీసెస్‌కు
సంబంధించిన ఓ వెబ్‌సైట్‌కు చెందిన ప్రతినిధులు దీనిపై పెద్ద పరిశోధనే చేశారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ థియేటర్ల వద్ద ఎవరూ లేకపోవటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అక్కడ చాలా సేపు మహిళలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా...వాళ్లు కాస్త ఇబ్బంది పడ్డారట. ఓ జంట కనిపిస్తే..
ఆ వెబ్‌సైట్ వాళ్లు వెళ్లి పురుషుడిని ప్రశ్నించారట. ఆ సంభాషణ ఇలా సాగింది.
ప్రశ్న: సంతానం వద్దనుకుంటే మీరే వ్యాసెక్టమీ చేయించుకోవచ్చు కదా..? మీ భార్యకు ట్యూబెక్టమీ ఎందుకు చేయిస్తున్నారు..?
జవాబు: (చాలా సేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. భార్య వెనకాల నవ్వుతుంటే ఏం చెప్పాలో తోచలేదు. కాసేపటికి సమాధానమిచ్చాడు) నాకు వ్యాసెక్టమీ చేయించుకోవాలంటే భయంగా ఉంది.
ఈ వ్యక్తి మాత్రమే కాదు. చాలా మందిలో ఇలాంటి అపోహే ఉంది. వ్యాసెక్టమీ చేయించుకుంటే ఏదో ఉపద్రవం వచ్చి మీద పడుతుందని భయపడిపోతుంటారు. అదే..మహిళలకు మాత్రం ఆ భయం ఉండదా...అని ఆలోచించటం లేదు. 2019-21 మధ్య కాలంలో ఇదే సమస్యపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఓ అధ్యయనం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలపై సర్వే నిర్వహించింది. వారిలో దాదాపు 38% మంది కుటుంబ నియంత్రణ ఆరరేషన్ చేయించుకున్న వాళ్లున్నారు. అదే పురుషుల్లో ఈ శాతం ఎంతో తెలుసా..? కేవలం 0.3%. అత్యధికంగా యూపీలో మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.
పురుషులకెందుకు భయం..?
ఏ హెల్త్ సెంటర్‌లో పని చేసే వైద్యులను ప్రశ్నించినా.." మా దగ్గరకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు వచ్చే వారిలో అందరూ మహిళలే ఉంటున్నారు" అని బదులిస్తున్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవగాహన పెంచేందుకు ప్రభుత్వం వేలకు బోలెడంత ఖర్చు చేస్తున్నాయి. కానీ...అది ఏ మాత్రం ఆలోచనల్లో మార్పు తీసుకు రావటం లేదు. ఆశా కార్యకర్తలు మారుమూల గ్రామాల్లోని ఇంటింటా తిరుగుతూ...పురుషులూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని వివరిస్తున్నా...ఎవరూ పట్టించుకోవటం లేదు. కొన్ని చోట్ల వారికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. వాటిలో ఓ ఉదాహరణ ఇప్పుడు చూద్దాం.
ఆశా కార్యకర్త: "మీరు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చు. అది మహిళలకు మాత్రమే అని అనుకోవద్దు.
ఓ వ్యక్తి: అదేంటి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఆడాళ్లు కదా చేయింకుంటారు. మగాళ్లం మాకెందుకు చెబుతున్నారు..?
ఆశా కార్యకర్త: అలా కాదండి. ఇప్పుడే చెప్పాను కదా మగాళ్లూ చేయించుకోవచ్చు. ఎలాంటి సమస్యా ఉండదు.
ఓ వ్యక్తి: అయినా వ్యాసెక్టమీ చేయించుకున్న తరవాత మగాళ్లు చాలా వీక్ అయిపోతారట. అందుకే మాకీ ఆపరేషన్ వద్దు.
ఆశా కార్యకర్త: అదంతా అపోహ. మీరనుకున్నట్టుగా ఏమీ ఉండదు. కుట్లు కూడా అవసరం లేకుండా ఆపరేషన్ జరిగిపోతుంది"
ఆ వ్యక్తి భార్య: మేడమ్. మా ఆయనను ఇబ్బంది పెట్టకండి. ఆయన నీరస పడిపోతే ఇల్లెలా గడిచేది. ఆ పాట్లేదో మేమే పడతాం.
ఇదిగో ఇలా ఉంటుంది గ్రామాల్లోని పరిస్థితి. ఇలాంటి అభిప్రాయాలు, అనుమానాలున్న చోట ఇక వ్యాసెక్టమీ ఆపరేషన్లు ఎక్కడ జరుగుతాయి..?
అవగాహన లేకే ఈ సమస్య..
ఇండియాలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలన్నీ...ఎక్కువగా మహిళలపైనే ఫోకస్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్ (ICRW) కూడా ఇదే విషయం వివరిస్తోంది. ఇందుకు కారణమేంటి అంటే...స్త్రీలు పిల్లల్ని కనాలా వద్దా, ఎంత మందిని కనాలి..అనే విషయాలు పూర్తిగా పురుషులపైనే ఆధార పడి ఉండటం. భార్యలు తమకు ఇష్టం లేకుండా గర్భ నిరోధకాలు వాడ కూడదని దాదాపు 54% మంది పురుషులు భావిస్తున్నట్టు ICRW గతంలో ఓ సర్వేలో వెల్లడించింది. అంతే కాదు. గర్భం రాకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం మహిళలదే అని నమ్మే వాళ్లూ ఎక్కువ మందే ఉన్నారు. అసలు సమస్య ఎక్కడుందని చూస్తే...కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీరిలో అందరూ మహిళలే ఉంటారు. పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌పై అవగాహన కల్పించేందుకు పురుషులే ఉంటే కనీసం చర్చించేందుకైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకొస్తారు. కానీ...అందరూ మహిళలే ఉండటం వల్ల బెరుకుతోనో, సిగ్గుతోనో అసలు ఏమీ మాట్లాడటం లేదు. క్షేత్రస్థాయిలోని ఆరోగ్య సిబ్బందిలో పురుషులనూ నియమిస్తే...ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం దొరుకుతుందన్నది కొందరి ఉన్నతాధికారుల అభిప్రాయం.
Also Read: Harish Rao: కు.ని. విఫల ఘటనలో డాక్టర్లపై వేటు: హరీశ్ రావు - బాధితులను కలిసిన మంత్రి
Also Read: మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లా? ప్రాణాలు ముఖ్యమా? రికార్డులు ముఖ్యమా?: బండి సంజయ్