![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
అర్జెంటీనా ప్రభుత్వం సంచలన నిర్ణయం, 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
Argentina Job Cuts: అర్జెంటీనా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రెసిడెంట్ ప్రకటించారు.
![అర్జెంటీనా ప్రభుత్వం సంచలన నిర్ణయం, 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు Argentina President Javier Milei Planning to Cut 70000 State Jobs అర్జెంటీనా ప్రభుత్వం సంచలన నిర్ణయం, 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/dd7b04f60596ad535a497f3bdac7be821711537456459517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Job Cuts in Argentina: అర్జెంటీనా అధ్యక్షుడు జావియెర్ మిలీ (Javier Milei) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది నెలల్లో 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించారు. అంతే కాదు. కొన్ని ప్రభుత్వ పనులనూ ఇప్పటికిప్పుడు నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాలకు నిధులు నిలిపివేయడంతో పాటు సంక్షేమ పథకాల అమలునీ రద్దు చేయనున్నట్టు తేల్చి చెప్పారు. దాదాపు 2 లక్షల మేర సంక్షేమ పథకాల్ని పక్కన పెట్టనున్నట్టు Bloomberg వార్తా సంస్థ వెల్లడించింది. ఆర్థికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. గతేడాది డిసెంబర్‌లోనే ప్రెసిడెంట్ జావియెర్ ఓ కీలక ప్రకటన చేశారు. 5 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్‌లను రెన్యువల్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి రాకముందు నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులనూ కొనసాగించే ఉద్దేశం లేదని తెలిపారు. లేఆఫ్‌లలో భాగంగానే వీళ్లందరినీ తొలగించనున్నట్టు జావియెర్ మిలీ వివరించారు.
అర్జెంటీనాలో మొత్తం 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అందులో తొలగించే ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఇన్ని వేల మందిని ఒకేసారి తీసేస్తున్నట్టు ప్రకటించడమే సంచలనమవుతోంది. కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. అటు ప్రైవేట్ సెక్టార్‌లోనూ పరిస్థితులు ఏమీ బాలేవు. వేతనాలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకూ భరోసా లేకుండా పోయింది. అయితే..కేవలం దేశ ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు జావియెర్ మిలీ వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)