AP, TS Letters To KRMB : నదీ బోర్డుల భేటీకి ముందు లేఖల యుద్ధం..! ఏపీ, తెలంగాణ పరస్పర ఫిర్యాదులు..!
నదీ యజమాన్య బోర్డుల భేటీ సమయం దగ్గరవుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. తాజాగా జల విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా బోర్డుకు వరుస లేఖలు రాస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కృష్ణాబోర్డుకు మరో లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖలో ఆరోపించారు.
ఇండెంట్ లేకుండా నీటి విడుదల వద్దని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ..!
సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని లేఖలో ఆరోపించారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో పాటు సాగునీటి అవసరాల కోసం ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని లేఖలో వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు భౌగోళికంగా తెలంగాణ భూభాగంలో ఉండిపోయాయని .. ఈ రెండు ప్రాజెక్టుల దిగువన తాగు, సాగునీటి అవసరాలేమీ తెలంగాణకు లేవని లేఖలో ఏపీ ఈఎస్సీ తెలిపారు. కృష్ణా డెల్టాలో నీటి అవసరాలపై ఏపీ ఇండెంట్ ఇస్తేనే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా కేఆర్ఎంబీకి ఏపీ విజ్ఞప్తి చేసింది.
వెలుగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు..!
వారం రోజుల కిందట ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని లేఖలో ... వరద జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని లేఖలో వివరించారు. వెలిగొండ ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీరు తరలిస్తున్నారని లేఖలో పేర్కొంది.
వెలుగొండ ప్రాజెక్టుపై ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా నేతల లేఖ..!
ఈ లేఖపై ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రభుత్వంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా నేతలు లేఖ రాశారు. కేంద్ర గెజిట్‌లో ఆ ప్రాజెక్ట్‌ను చేర్చకపోవడం ముమ్మాటికీ జగన్ ప్రభుత్వ వైఫల్యమే తప్ప.. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేనట్లు కాదని తెలిపారు. వెలిగొండ అక్రమ ప్రాజెక్టుకాదు. అన్ని అనుమతులూ ఉన్నాయన్నారు. విభజన చట్టంలో వెలిగొండను చేర్చిన కేంద్రం.. ఇటీవల ప్రకటించిన గెజిట్‌లో చేర్చలేదు. గెజిట్‌లో లేదన్న సాకును, ఏపీ ప్రభుత్వ అసమర్థను ఆసరా చేసుకొని వెలిగొండపై కేంద్రానికి ఫిర్యాదు చేసి.. ప్రకాశం జిల్లా ప్రజల కడుపు కొట్టవద్దని కోరారు.
సెప్టెంబర్ 1న నదీయాజమాన్య బోర్డుల భేటీ
ఇప్పటికి రెండు ప్రభుత్వాల మధ్య నీటి వాటాపై పరస్పరం కేఆర్ఎంబీకి లేఖలు రాశాయి. కృష్ణా జలాల్లో సగం సగం వాటా కావాలని తెలంగామ పట్టు బడుతూండగా..ఏపీ మాత్రం గతంలోలా 70-30 శాతం వాటాలు కొనసాగించాలని కోరుతున్నారు. నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్నాయి. ఈ లోపు .. రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.