Andhra Pradesh: వాహనాలకు నకిలీ స్టిక్కర్లు.. ఏపీలో 138 మందిని పట్టుకున్న పోలీసులు..
వృత్తులతో సంబంధం లేకుండా కొందరు తమ వాహనాలపై నకిలీ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇలాంటి నకిలీ గాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ స్టిక్కర్లతో ఉన్న 138వాహనాలను గుర్తించారు.
ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో వాహనాలకు నకిలీ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. చేసే పనితో సంబంధం లేకుండా కొంతమంది ప్రభుత్వ శాఖల స్టిక్కర్లు వేసుకుని దర్జాగా తిరుగుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసు, ప్రెస్, ఇతర శాఖలకు చెందిన వారమని చెబుతూ.. వాహనాలపై నకిలీ స్టిక్కర్లతో కొంత మంది జిల్లాలో తిరుగుతున్న విషయాన్ని గమనించారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయనే అంశాన్ని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా కాకినాడ, విశాఖ పట్నం సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా 138 మంది వాహనదారులు నకిలీ స్టిక్కర్లను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా నకిలీ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసుల తనిఖీలలో రోడ్లపై తిరిగే అనేక వాహనాలకు ప్రెస్, పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, ప్రభుత్వ శాఖల స్టిక్కర్లు పెట్టుకుని వెళుతుండటం గమనించామని ఎస్పీ చెప్పారు. పోలీసులకు పట్టుబడ్డ వాహనాల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పేర్లతో నకిలీ స్టిక్కర్లు ఉన్న వాహనాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో సారి చిక్కితే కేసులే..
నకిలీ స్టిక్కర్ల వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఈ డ్రైవ్ కేవలం ప్రాథమికంగా ముందస్తు హెచ్చరికలు చేస్తూ నిర్వహించామని.. రెండో సారి చిక్కితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల తనిఖీల్లో నకిలీ స్టిక్కర్లు గల వాహనాలు 138 చిక్కాయని చెప్పారు. పోలీస్ శాఖతో సంబంధం లేని వాహనాలు 76 ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రెస్, మీడియాతో సంబంధం లేకపోయినా.. వాటి స్లిక్కర్లను అంటించుకుని ఉన్న వాహనాల సంఖ్య 62 అని పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, వాహనాలకు ఉన్న స్టిక్కర్లను తొలగించామని పోలీసులు వెల్లడించారు.
ఇకపై వాహనాలపై ఎలాంటి నకిలీ స్టిక్కర్లు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు తరచూ జరుగుతాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చే వరకూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు.
Also Read: TDP Protest: రైతుల కోసం రోడ్డెక్కిన టీడీపీ.. రాయలసీమ జిల్లాల్లో ‘రైతు కోసం తెలుగుదేశం’..