Amrit Bharat Trains: రేపటి నుంచి పట్టాలెక్కనున్న అమృత్ భారత్ రైలు- ఏపీలోని ఈ స్టేషన్‌ల మీదుగా ట్రైన్
అమృత్ భారత్ రైళ్లు రేపటి నుంచి పట్టాలెక్కనున్నాయి. రేపు ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించున్నారు. అమృత్ భారత్ రైళ్లలో ఒకటి ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది.
Amrit Bharat Trains: ఇండియన్ రైల్వే కొత్తగా ప్రవేశపెడుతున్న 'అమృత్ భారత్'ఎక్స్‌ప్రెస్ రైళ్లు(Amrit Bharat Express) రేపు(శనివారం) పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్‌ప్రెస్ రైలును రేపు ప్రధాని మోడీ(PM Modi) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా.. ప్రయాణిస్తుంది అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ ట్రైన్‌లో 12 స్లీపర్ క్లాస్, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయి. ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.
పుష్-పుల్ టెక్నాలజీతో తయారయ్యాయి అమృత్ భారత్ రైళ్లు. పుష్-పుల్ టెక్నాలజీలో... రెండు ఇంజన్లను కలిగి ఉంటుంది. ఒకటి ముందు. మరొకటి వెనుక ఉంటాయి. ముందు ఇంజిన్ రైలును లాగుతున్నప్పుడు, వెనుక ఇంజిన్ ఏకకాలంలో దాన్ని నెట్టివేస్తుంది. ఈ టెక్నాలజీ.. రైలు అత్యంత వేగాన్ని అందుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ డిజైన్ వల్ల... ఎత్తైన వంతెనలు, భారీ మలుపులు, స్పీడ్ బ్రేకర్ విభాగాల దగ్గర సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. అమృత్ భారత్ ట్రైన్స్ కుంకుమ-బూడిద రంగులో ఉంటాయి.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొబైల్ హోల్డర్లు, స్లైడర్ ఆధారిత విండో గ్లాస్ అమర్చబడి ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు మోడ్రన్ టచ్ ఇస్తాయి. స్టేషన్‌ను సమీపించే వివరాలను కూడా ట్రైన్స్‌లో ప్రదర్శిస్తారు. అందుకోసం రైలులో ప్రయాణీకుల సమాచార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్, జనరల్ కోచ్‌లతో కలిపి 22 కోచ్‌లు ఉంటాయి. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్ ధరలు... మిగిలిన ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే 15 నుంచి 17శాతం ఎక్కువగా ఉంటాయి. 50 కిలోమీటర్ల లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ.35గా నిర్ణయించారు. రిజర్వేషన్ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు తెలిపింది.
రేడియం ఇల్యుమినేషన్... అమృత్ భారత్ రైలు బోగీల మరో ప్రత్యేకత. రాత్రి వేళల్లో లైట్లు ఆర్పివేసి ఉన్న సమయాల్లో ప్రయాణికులకు ఈ టెక్నాలజీ సహాయకంగా ఉంటుంది. ఇండియన్ రైల్వే ఈ సాంకేతికతను రైలు బోగీల్లో తొలిసారిగా ప్రవేశపెడుతోంది. అమృత్ భారత్ రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు ఉంటాయి. అత్యవసర వేళల్లో సమాచారాన్ని అందించేందుకు ఎల్‌ఈడీ డిస్‌ప్లే వ్యవస్థ ఉంటుంది. సౌకర్యవంతంగా సీట్లు, LED లైట్లు, ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో అత్యాధునిక బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేశారు. వీటికి సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి. ఈ రైలులో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించొచ్చు. 800 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న నగరాల మధ్య ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. వాటిల్లో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్‌తో పాటు అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. వందేభారత్ తరహాలో మరింత డైనమిక్‌గా దీనిని డిజైన్ చేశారు. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు అధునాతన సౌకర్యాలు కల్పించారు.