Modi cabinet: మోదీ 2.0: కేబినెట్లోకి యూత్.. ఈసారి వారికే ఎక్కువ ఛాన్స్!
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి విస్తరణ.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలపై అప్పుడే ఫోకస్ చేసింది బీజేపీ. ఇప్పటికే పార్టీలో మార్పులు చేసింది. అదే స్పీడ్‌తో కేంద్ర కేబినెట్‌లోనూ ఛేంజస్‌కు రెడీ అయింది. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న మోదీ... భారీ మార్పులతో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 22 మంది కొత్తవారికి కేబినెట‌్‌లో ఛాన్స్ ఇవ్వబోతున్నారట. వీరిలో ఎక్కువ ఫ్రెష్ ఫేసెస్.
రాజకీయ కారణాల వల్ల జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), సుశీల్‌కుమార్ మోదీ (బిహార్), సర్బానంద సోనోవాల్ (అసోం)లకు కేంద్ర కేబినెట్‌లో బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎక్కువ అవకాశాలున్న ఇలాంటివారు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే 7 లోక్ కల్యాణ్ మార్గ్‌కు చేరారు.
వారికే ఎక్కు వ ఛాన్స్..
ఈసారి కేబినెట్లో యూత్‌కు ఎక్కవగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకు లేనంతగా కేబినెట్లో యువతకు అవకాశం ఇస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే మహిళా ప్రాతినిథ్యాన్ని కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారని టాక్. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎక్కువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గంలో యూపీ నుంచి ఉన్న 9 మందిలో కొంతమంది పోర్టుపోలియో మర్చవచ్చ. యూపీ నుంచి అవకాశాలున్నవారిలో జోషితోపాటు, అజయ్‌మిశ్ర, సకల్‌దీప్ రాజ్‌భర్, పంకజ్ చౌదరి, రాంశంకర్ కతేరియా, వరుణ్‌గాంధీ, రాజ్‌వీర్‌సింగ్, అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిని తప్పించి..
మాయావతి, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలను దృష్టిలో పెట్టుకుని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి తప్పించి, యూపీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు- ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడపై వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల మాటేంటి.?
తెలుగు రాష్ట్రాలనుంచి పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు పేరు మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
బిహార్ నుంచి..
జేడీయూ లోక్‌సభాపక్ష నేత రాజీవ్ రంజన్, ఎల్‌జేపీ నుంచి రాంవిలాస్ పాసవాన్ సోదరుడు పశుపతి కుమార్ పారాస్‌కు స్థానం కల్పించనున్నట్లు సమాచారం.
వీరికి తగ్గనున్న భారం..
కేంద్ర మంత్రుల్లో నరేంద్రసింగ్ తోమర్ నాలుగు మంత్రిత్వ శాఖలు; ప్రకాశ్ జావడేకర్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, హర్షవర్ధన్ మూడేసి శాఖలు నిర్వహిస్తున్నారు. కొత్త మంత్రులు రానున్న నేపథ్యంలో వీరికి పనిభారం తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్, రమేష్ పోఖ్రియాల్‌లకు స్థాన చలనం కలగవచ్చని సమాచారం. ప్రస్తుత సహాయ మంత్రుల్లో 68-69 ఏళ్ల వయసువారైన హర్‌దీప్‌సింగ్ పురి, ఆర్‌కే సింగ్, అశ్వినీకుమార్ చౌబే, జనరల్ వీకే సింగ్‌లాంటి వారున్నారు. వీరిలో కొందరిపై వేటువేసి యువతను తీసుకొచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.