Rudramkota Review - 'రుద్రంకోట' రివ్యూ : 'జానకి కలగనలేదు' సీరియల్ దర్శక, నిర్మాతలు తీసిన సినిమా
Rudramkota Review In Telugu : సీనియర్ నటి జయలలిత సమర్పణలో అనిల్ ఆర్కా హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా 'రుద్రంకోట'. పలు సీరియల్స్ డైరెక్ట్ చేసిన రాము కోన దర్శకత్వం వహించారు.
రాము కోన
అనిల్ ఆర్కా, విభీషా జాను, సీహెచ్ జయలలిత తదితరులు
సినిమా రివ్యూ : రుద్రంకోట
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అనిల్ ఆర్కా కండవల్లి, విభీషా జాను, అలేఖ్యా, సీహెచ్ జయలలిత, భాస్కర్ రావు తదితరులు
ఛాయాగ్రహణం : ఆదిమల్ల సంజీవ్
నేపథ్య సంగీతం : కోటి
స్వరాలు : సంతోష్ ఆనంద్, యువి నిరంజన్
నిర్మాత : అనిల్ ఆర్కా కండవల్లి
కథ, కథనం, దర్శకత్వం : రాము కోన
విడుదల తేదీ: సెప్టెంబర్ 22, 2023
'జానకి కలగనలేదు' (Janaki Kalaganaledu Serial) సహా బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియళ్లలో ఐదు వేలకు పైగా ఎపిసోడ్లకు దర్శకత్వం వహించిన రాము కోన... సినిమాల్లోకి వచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా 'రుద్రంకోట' (Rudramkota Movie). దీంతో 'జానకి కలగనలేదు' నిర్మాత అనిల్ ఆర్కా హీరోగా పరిచయమయ్యారు. నటి సీహెచ్ జయలలిత సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ చిత్రమిది.
కథ (Rudramkota Movie Story) : 'రుద్రంకోట'లో కోటమ్మ (సీనియర్ నటి సీహెచ్ జయలలిత) మాటకు తిరుగులేదు. ప్రేమలో నిజాయతీ ఉంటే ఆ జంటకు పెళ్లి చేసే ఆమె... ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే అసలు సహించదు. తప్పు చేసిన వాళ్లకు మరణ శిక్ష విధిస్తుంది. రుద్ర (అనిల్ ఆర్కా కండవల్లి) కళ్ళుగప్పి ఎవరూ ఆ ఊరు దాటలేరు.
కోటమ్మ కట్టుబాట్లు, రుద్ర అదుపాజ్ఞలను మీరి 'రుద్రంకోట'లో ఓ ఘోరానికి కొందరు యువకులు ఒడికడతారు. అది ఏమిటి? పట్నం నుంచి పల్లెలోకి వాళ్ళు రావడానికి కారణం ఏమిటి? కోటమ్మ మనవరాలు ధృతి (అలేఖ్య) ఊరిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? రుద్రను ప్రేమించిన శక్తి (విభీషా జాను) ఎవరు? ఆమెకు ఏమైంది? ఆడవాళ్లతో మాట్లాడటం కాదు కదా, కనీసం కన్నెత్తి చూడని రుద్ర స్మశానంలో ఎందుకు ఉంటున్నాడు? అతని నేపథ్యం ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ (Rudramkota Movie Review) : అక్రమ సంబంధాలు జీవితాలను ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయి? కొందరి జీవితాలను ఏ విధంగా కాలరాస్తున్నాయి? కామంతో కొందరు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో తెలుగులో కొన్ని చిత్రాలు వచ్చాయి. ఆ జాబితాలో 'రుద్రంకోట' కూడా ఉంటుంది.
'రుద్రంకోట'లో కథ కొత్తది ఏమీ కాదు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పల్లెటూరి నేపథ్యం ఎంపిక చేసుకోవడంతో డ్రసింగ్ నుంచి మేనరిజమ్స్ వరకు దర్శకుడికి మరింత స్వేచ్ఛ లభించింది. సినిమాకు ఆ హీరో పాత్ర బలంగా నిలిచింది. సినిమా మొదలైన వెంటనే కోటమ్మ, రుద్ర పాత్రలను పరిచయం చేసిన రాము కోన... కథపై ఆసక్తి కలిగించారు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్ బాగా తీశారు. అయితే... తర్వాత తర్వాత ఆసక్తిగా ముందుకు వెళ్లడంలో చాలా నిదానంగా అడుగులు వేశారు. మళ్ళీ పతాక సన్నివేశాల్లో పట్టు చూపించారు. సమాజానికి అవసరమైన సందేశం ఇచ్చారు.
కోటమ్మ మనవరాలు ధృతి పాత్రలో 'ఆర్ఎక్స్ 100' సినిమాలో హీరోయిన్ ఛాయలు కనపడతాయి. ఆమె పాత్ర ఎంటరైన తర్వాత వచ్చే సన్నివేశాలను ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే... పతాక సన్నివేశాల్లో దర్శకుడు సర్‌ప్రైజ్ చేశారు. ఇటువంటి సినిమాలకు బలమైన డైలాగులు పడితే బావుండేది. డైలాగులు పేలవంగా ఉన్నాయి. కోటమ్మ, రుద్ర నేపథ్యాలను బలంగా రాసుకోలేదు. పైపైన తీసుకు వెళ్లారు. ఆర్టిస్టులు, కెమెరా మ్యాన్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్న దర్శకుడు... సన్నివేశాల నిడివి కత్తిరిస్తే బావుండేది. విజువల్స్, ఎమోషన్స్ మీద దర్శకుడు పట్టు చూపించారు. కొత్త కథ, బడ్జెట్ దొరికితే ఆయన మంచి సినిమాలు తీయగలరు.
'రుద్రంకోట'లో పాటలు బావున్నాయి. చిన్న సినిమాల్లో ఈతరహా పాటలు ఉండటం అరుదు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. పల్లె అందాలను కెమెరాలో చాలా చక్కగా బంధించారు. అయితే... కోటి నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేయలేదు. సీనియర్ సంగీత దర్శకుడు చేసినట్లు అనిపించలేదు. చిన్న సినిమా కావడంతో కొన్ని సన్నివేశాల్లో పరిమితులు స్పష్టంగా కనిపించాయి.
నటీనటులు ఎలా చేశారంటే : అనిల్ ఆర్కాకు తొలి చిత్రమైనా చక్కగా చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ కూడా అలా కుదిరింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో, ఆ స్మశానంలో ఆయన రుద్రావతారం ఆకట్టుకుంటుంది. మాస్ యాక్టర్ అయ్యే ఛాయలు కనపడుతున్నాయి. కోటమ్మగా సీనియర్ నటి జయలలిత పాత్ర పరిధి మేరకు చేశారు. పల్లెటూరి అమ్మాయి శక్తిగా విభీషా జాను ఒదిగిపోయారు. పట్నం నుంచి పల్లెకు వచ్చిన అమ్మాయిగా అలేఖ్య గ్లామర్ ఒలకబోశారు. మాటలు రాని వ్యక్తిగా భాస్కర్ రావు కనిపించారు.
Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
చివరగా చెప్పేది ఏంటంటే : రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో, అంతా కొత్తవాళ్ళతో తీసిన రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ చూసే ప్రేక్షకులను 'రుద్రంకోట' ఆకట్టుకుంటుంది. కథ పరంగా కొత్తదనం లేదు. కథనం కూడా సాధారణంగా ఉంటుంది. నిడివి కాస్త తగ్గిస్తే బావుండేది. సినిమా ప్రారంభం, చివరిలో సన్నివేశాలు సర్‌ప్రైజ్ చేస్తాయి. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళండి.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial