Peddanna Review: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా.. ఇలాగైతే కష్టమే!
Peddanna Movie Review: రజనీకాంత్, కీర్తీ సురేష్ అన్నాచెల్లెళ్లుగా నటించిన 'పెద్దన్న' (తమిళంలో 'అణ్ణాత్తే') దీపావళి కానుకగా విడుదలైంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రజనీకి విజయం అందించిందా?
Shiva
Rajinikanth, Keerthy Suresh, Nayanthara, Meena, Khushbu, Jagapati Babu and others
రివ్యూ: పెద్దన్న
రేటింగ్: 1.5/5
ప్రధాన తారాగణం: రజనీకాంత్, కీర్తీ సురేష్, నయనతార, అభిమన్యు సింగ్, జగపతి బాబు, ఖుష్బూ, మీనా, సూరి తదితరులు
ఎడిటర్: రూబెన్
కెమెరా: వెట్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్
సంగీతం: డి. ఇమాన్
సమర్పణ: కళానిధి మారన్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, 'దిల్' రాజు (తెలుగులో విడుదల)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ
విడుదల: 04-11-2021
తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే... కొన్నాళ్లుగా ఆయనకు సరైన సినిమా పడటం లేదు. ఈ సమయంలో పల్లెటూరి నేపథ్యంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో దర్శకుడు శివ పెద్దన్న తీశారు. ఈ సినిమా ఎలా ఉంది? రజనీకి హిట్ అందించిందా?
కథ: వీరన్న (రజనీకాంత్)కు చెల్లెలు కనక మహాలక్ష్మి (కీర్తీ సురేష్) అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ. చెల్లెలు పిలిస్తే కాదు... మనసులో తలిచినా ఆమె ముందు వాలతాడు. పెళ్లైన తర్వాత చెల్లెలు తనకు దూరం కాకూడదని తమ ఊరికి దగ్గరలో సంబంధాలు చూడటం మొదలు పెడతారు. చెల్లెలి అభిప్రాయం అడిగితే... అన్నయ్య నిర్ణయమే తన నిర్ణయం అని చెబుతుంది. అయితే... పెళ్లి రోజు ఇంటి నుంచి కనక మహాలక్ష్మి వెళ్లిపోతుంది. ఎందుకు? కనక మహాలక్ష్మి ఎవరితో వెళ్లింది? ఆ తర్వాత ఏమైంది? కోల్‌కతాలో మనోజ్ (అభిమన్యు సింగ్), ఉత్తమ్ (జగపతిబాబు)కు, కనక మహాలక్ష్మికి మధ్య గొడవలు ఏమిటి? చెల్లెలు ఆపదలో ఉన్నదని తెలిశాక అన్నయ్య ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'పెద్దన్న' గురించి చెప్పాలంటే... రజనీకాంత్ గురించి చెప్పాలి. రజనీ గురించి మాత్రమే చెప్పాలి. ఈమధ్య కాలంలో ఏ సినిమాలోనూ సూపర్‌స్టార్ ఇంత ఎనర్జీతో కనిపించలేదు. ఇంత హుషారుగా నటించలేదు. ఫైట్స్‌లో అంత ఇన్వాల్వ్ అయ్యి చేయలేదు. రజనీకాంత్ తర్వాత కీర్తీ సురేష్ గురించి చెప్పుకోవాలి. చెల్లెలి పాత్రలో చక్కగా నటించింది. ఖుష్బూ, మీనా పాత్రలు ఎందుకు వచ్చాయో? ఎందుకు వెళ్లాయో? వాళ్లిద్దరి ఎపిసోడ్ విసిగిస్తుంది. పెళ్లి సంబంధాల కోసం వెతికే ప్రక్రియ కూడా ఏమంత బాలేదు. కొంతలో కొంత ఫస్టాఫ్‌లో నయనతార ఎపిసోడ్ రిలీఫ్ ఇస్తుంది. రెగ్యులర్ రొటీన్ స్టోరిని అక్కడివరకూ చూడగలిగామంటే... రజనీ ఎనర్జీయే కారణం. ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి క్లైమాక్స్ వరకూ థియేటర్లలో స్క్రీన్ ముందున్న ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా కథ, స్క్రీన్ ప్లే నడుస్తాయి. అంత రొటీన్ స్టోరితో శివ సినిమా తీశాడు. చూసేటప్పుడు పవన్ కల్యాణ్ 'అన్నవరం' గుర్తు వస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, టేకింగ్ ను రజనీకాంత్ కూడా సేవ్ చేయలేకపోయారు. కీర్తీ సురేష్ నటన కూడా వృథాప్రయాసే అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో సాగదీత వలన త్వరగా సీన్ పూర్తయితే బావుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. జగపతిబాబు స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ... క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం రొటీన్ అయినప్పటికీ... ఆయన గెటప్, విలనిజం బావున్నాయి.
రొటీన్ స్టోరితో దర్శకుడు శివ సినిమా తీశాడంటే... అంత కంటే రొటీన్ రీ-రికార్డింగ్ తో డి. ఇమ్మాన్ చెవుల్లో హోరెత్తించాడు. ఒకవేళ... తమిళ ప్రేక్షకులకు ఆ రీ-రికార్డింగ్ పూనకాలు తెప్పిస్తుందేమో? తెలుగులో మాత్రం కష్టమే! కొన్నాళ్లుగా రజనీకాంత్ యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. రజనీకాంత్ కంటే తక్కువ స్టార్‌డమ్ ఉన్న హీరోలతో కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు చేసిన సదరు దర్శకులు... రజనీ దగ్గరకు వచ్చేసరికి కథ కంటే హీరోయిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అవకాశాలను వేస్ట్ చేసుకున్నారు. దర్శకుడు శివ కూడా ఆ జాబితాలో చేరాడు. శివ ప్రతి సినిమాలో కనిపించే తమిళ నేటివిటీ ఈ సినిమాలో కూడా ఫుల్లుగా ఉంది. సినిమాలో కొత్తగా ఏమీ లేదు. రజినీకాంత్ ఎనర్జీ... రజనీ-కీర్తీ సురేష్ మధ్య కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకుంటాయి. పాటల్లో, ఫైటుల్లో, సన్నివేశాల్లో సూపర్‌స్టార్‌ను అందంగా చూపించిన చిత్రమిది.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి