Manchi Rojulu Vachayi Review: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Manchi Rojulochaie Movie Review: కూతురు ప్రేమలో పడిందని తెలిసిన తర్వాత కోప్పడే తల్లితండ్రులను చాలామందిని తెలుగుతెరపై చూశాం. ఒకవేళ తండ్రి భయపడితే? ఇదే 'మంచి రోజులు వచ్చాయి' కాన్సెప్ట్.
Maruti
Santosh Shoban, Mehreen Pirzada, Ajay Ghosh
రివ్యూ: మంచి రోజులు వచ్చాయి
రేటింగ్: 3/5
ప్రధాన తారాగణం: సంతోష్ శోభన్, మెహరీన్, అజయ్ ఘోష్, ప్రవీణ్, 'వెన్నెల కిశోర్ తదితరులు
కెమెరా: సాయి శ్రీరామ్
సాహిత్యం: కృష్ణకాంత్, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
దర్శకత్వం: మారుతి
విడుదల: 04-11-2021
మారుతి గత చిత్రాలు చూస్తే... ఓ చిన్న పాయింట్ తీసుకుని దానిచుట్టూ కామెడీ సీన్లు రాసుకుని కథ అల్లేస్తారు. క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని చాలా క్యాజువల్‌గా సినిమా తీస్తారు. కూతురు ప్రేమలో పడిందని... అర్జంటుగా ఆమెకు పెళ్లి చేయాలని భయపడే తండ్రిని చుట్టుపక్కల వాళ్లు మరింత భయపడితే? అనే కాన్సెప్ట్ తీసుకుని 'మంచి రోజులు వచ్చాయి'లో ఎంత కామెడీ చేశారు? ఏంటి?
కథ: 'తన కూతురు లాంటి కూతురును కన్న ఏ తండ్రి అయినా ఆరోగ్యంగా ఉండాల్సిందే' - ఇదీ గోపాలం తిరుమలశెట్టి (అజయ్ ఘోష్) ఫీలింగ్. ఆరోగ్యంగానే కాదు... అతడు సంతోషంగా కూడా ఉంటాడు. అతడి కాలనీలో ఇద్దరు స్నేహితులకు అది నచ్చదు. గోపాలాన్ని భయపెట్టేయాలని కంకణం కట్టుకుంటారు. 'మీ కూతురు కొలీగ్‌తో ప్రేమలో పడింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కుర్రాళ్లను నమ్మకూడదు. చాలా హార్డ్‌గా ఉంటున్నారు' అని భయపెడతారు. ఆ భయానికి తగ్గట్టు గోపాలం కూతురు పద్మ (మెహరీన్), ఆమె కొలీగ్ సంతోష్ (సంతోష్ శోభన్)తో గాఢమైన ప్రేమలో ఉంటారు. గోపాలానికి ఆ విషయం తెలిశాక ఏం చేశాడు? తండ్రికి తన ప్రేమ విషయం తెలిశాక పద్మ ఏం చేసింది? లవర్ తండ్రిలో భయాలు పోగొట్టడానికి సంతోష్ ఏం చేశాడు? చివరకు సమస్యలు ఎలా తొలగాయి? ప్రేమికులిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? కరోనాకు, వీళ్ల కథకు సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'మంచి రోజులు వచ్చాయి'... ఇందులో మంచి నవ్వులు వచ్చాయి. మారుతి మార్క్ హ్యూమర్ వర్కవుట్ అయ్యింది. మరి, కథ? అని ఆలోచిస్తే... చాలా సింపుల్. ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం ఏమైపోతుందోనని భయపడిన తండ్రి పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తాడు. అమ్మాయి ప్రేమ సంగతి తెలుసుకోవాలని ఆరాటం, ఆత్రుత ఉన్న తండ్రి పాత్రతో... పెళ్లి సంబంధాల వేటలో... కావాల్సినంత కామెడీ చేశాడు మారుతి. తండ్రి భయం నుండి వీలైనంత వినోదం పిండేశాడు. అయితే... అక్కడితో ఇంటర్వెల్ కార్డు పడింది. కథ పెద్దగా లేకపోయినా... ఆ ఆలోచన ప్రేక్షకుడి మదిలో రాకుండా నవ్వించారు. ఇంటర్వెల్ కార్డు తర్వాత వినోదంలో వేగం తగ్గింది. కామెడీ కూడా! కానీ, ఎమోషనల్ సీన్లు పెరిగాయి. కథ రొటీన్ రూటు తీసుకుంది. కామెడీకి కనెక్ట్ అయినంతగా ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. పైగా, పక్కింటి వాళ్లకు కరోనా రావాలని ఎంతకైనా దిగజారే మనుషులు ఉంటారని అనుకోవడం కష్టమే. బలవంతంగా ఇరికించినట్టు ఉంటుంది. అయితే... కామెడీ సీన్లు వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులు నవ్వడం ఖాయం. 'వెన్నెల' కిశోర్ ఎపిసోడ్, ప్రవీణ్ 'అప్పడాల ఆంటీ' ఎపిసోడ్ బాగా వర్కవుట్ అయ్యాయి. చివర్లో సందేశం బావుంది. కానీ, కథకు దూరంగా ఏదో ముగించాలి కాబట్టి ముగించినట్టు ఉంటుంది.
వినోదం మధ్యలో మారుతి స్పేస్ తీసుకుని మరీ అమ్మాయి తండ్రి ఆందోళనను ఇంటర్వెల్ ముందు సన్నివేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే... కన్నతల్లి ప్రేమకు వినికిడితో సంబంధం లేదని ఓ సన్నివేశంలో చెప్పారు. అయితే... వినోదం ముందు అవి తేలిపోయాయి. ఎమోషన్ కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను తీసి ఉంటే బావుండేది. మారుతి దర్శకత్వానికి వినసొంపైన పాటలు, కనువిందైన ఛాయాగ్రహణం తోడయ్యాయి. 'సో సోగా...', 'ఎక్కేసిందే...' పాటలు బావున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి.
సంతోష్ శోభన్, మెహరీన్ జంట బావుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు బావున్నాయి. కెమిస్ట్రీ కూడా కుదిరింది. ప్రేమకథను చూపించకుండా... సినిమాను 'సో సోగా' పాటతో ప్రారంభించి, రిలేషన్షిప్‌లో ఉన్నట్టు చూపించడం మంచి ఆలోచన. మెహరీన్ సన్నబడినా అందంగా ఉన్నారు. అందంగా నటించారు. సంతోష్ శోభన్ స్టయిలిష్ గా ఉన్నారు. హీరో హీరోయిన్ల కంటే సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అజయ్ ఘోష్‌ది. భయాన్ని బాగా పలికించడంతో కామెడీ పండింది. 'వెన్నెల' కిశోర్ మార్క్ యాక్టింగ్ నవ్విస్తుంది. ప్రవీణ్, సప్తగిరి, సుదర్శన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నవ్వించారు. కథ, లాజిక్కులు గురించి ఎక్కువ ఆలోచించకుండా థియేటర్లకు వెళితే... దీపావళికి కాసేపు హ్యాపీగా నవ్వుకోవచ్చు. మారుతి కామెడీ మీద పెట్టిన దృష్టి... కథలో కామెడీ, భావోద్వేగాలను మిళితం చేయడం మీద పెడితే సినిమా మరింత బావుండేది.
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి