Dude Movie Review - 'డ్యూడ్' రివ్యూ: ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొడతాడా? 'ప్రేమలు' బ్యూటీతో చేసిన రొమాంటిక్ కామెడీ ఎలా ఉందంటే?
Dude Review Telugu: 'లవ్ టుడే', 'డ్రాగన్' విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా 'డ్యూడ్'. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
కీర్తిశ్వరన్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, హృదు హరూన్, రోహిణి తదితరులతో పాటు సత్య, నేహా శెట్టి
Pradeep Ranganathan's Dude Review In Telugu: 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన తాజా సినిమా 'డ్యూడ్'. ఇందులో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్. తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Dude Movie Story): కుందన (మమితా బైజు)... పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను ప్రేమిస్తుంది. ప్రపోజ్ చేస్తుంది కూడా! అయితే మరదలి ప్రేమను బావ రిజెక్ట్ చేస్తాడు. లవ్ ఫెయిల్యూర్ బాధ నుంచి బయట పడటం కోసం బెంగళూరు వెళుతుంది కుందన. ఎప్పుడూ పక్కన ఉండే అమ్మాయి దూరం అయ్యేసరికి... గగన్ మనసులో ప్రేమ బయటకు వస్తుంది. నేరుగా వెళ్లి మావయ్యకి చెబుతాడు. సంతోషంగా పెళ్లి చేయడానికి సిద్ధం అవుతాడు.
గగన్, కుందన పెళ్లికి వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి? మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అన్నది? గగన్ తల్లి (రోహిణి), కుందన తండ్రి మధ్య ఎందుకు.మాటలు లేవు? పెళ్లి తర్వాత ఏమైంది? గగన్ ఎటువంటి త్యాగం చేశాడు? పార్ధు (హృదూ హరూన్) ఎవరు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Dude Review Telugu): ప్రపంచంలో ఏడు కథలు మాత్రమే ఉన్నాయని, ఏ సినిమా అయినా ఆ కథలు చుట్టూ తిరుగుతాయని ఆ మధ్య ఓ దర్శకుడు చెప్పారు. అందులోనూ ప్రేమకథల్లో కొత్తదనం కష్టమే. అయితే ఆ కథను ఎలా చెప్పాడు? అనేది ముఖ్యం. ప్రేమ ఎప్పటికీ మారదు. అయితే ప్రేమను వ్యక్తం చేసే తీరు మారుతుంది. మనం ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం చేసే పనులు మారుతూ ఉంటాయి. దాన్ని ఎలా చూపించాం? అనేది ముఖ్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంటే... కథను కొత్తగా చెప్పే తీరులో, హీరో నటనలో 'డ్యూడ్' సక్సెస్ అయ్యింది.
'డ్యూడ్' సినిమాలో కొత్త కథ అసలు లేదు. చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిపై ప్రేమ కలగడం నుంచి మొదలు పెడితే బ్రేకప్, కుటుంబ అనుబంధాలు, పరువు హత్యలు... పదుల సంఖ్యలోని సినిమాలలో చూసేసిన సన్నివేశాలు ఇందులోనూ ఉన్నాయి. కథ ఎటువైపు వెళుతుంది? ఏం మలుపు తీసుకుంటుంది? అనేది ప్రేక్షకుల ఊహకు అర్థం అవుతూ ఉంటుంది. అయితే... మనకు తెలిసిన కథ - సన్నివేశాలను హీరో ప్రదీప్ రంగనాథన్ నటన, సాయి అభ్యంకర్ సంగీతం తెరపై కొత్తగా చూసేలా చేశాయి.
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు... ఏ దశలోనూ ఆయనను చూస్తే క్యారెక్టర్ తప్ప మరొకటి గుర్తుకు రాదు. ప్రదీప్ రంగనాథన్‌లో ఈ తరం యువకులు తమను తాము చూసుకుంటారు. రెగ్యులర్ కథ, సన్నివేశాలు సైతం ఆయన నటన వల్ల రిలేటబుల్‌గా మారాయి. సంగీత దర్శకుడిగా పరిచయమైన సాయి అభ్యంకర్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. సినిమా విడుదలకు ముందు పాటలు అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే... నేపథ్య సంగీతంలో పాటలను వాడిన తీరు బావుంది. మ్యూజిక్ సౌండింగ్ కొత్తగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైన్ సినిమాను రిచ్ గా మార్చింది.
దర్శకుడు కీర్తిశ్వరన్ కథలో కొత్త పాయింట్ ఏం లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే 'ఆర్య 2'ను గుర్తుచేస్తుంది. క్లైమాక్స్ అయితే మరీ కన్వీసింగ్‌గా ఉంటుంది. అయితే ఆయన రాసిన సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్, మరీ ముఖ్యంగా మేనరిజమ్స్ కొన్ని బాగున్నాయి. ఇంతకు ముందు మనం ఈ సన్నివేశం ఎక్కడో చూశామే అన్నట్టు అనిపించినా... చివరకు ఇచ్చే ట్విస్ట్, సీరియస్ సిట్యువేషన్‌లో చివర్న చేసే చిన్నపాటి కామెడీ కొత్తగా ఉంది. ప్రదీప్ రంగనాథన్ నటన దర్శక రచయిత లోపాలను చాలావరకు కవర్ చేసింది.
ప్రదీప్ రంగనాథన్ జంటగా 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు సైతం చాలా చక్కగా నటించింది. హీరోయిన్ నటన సహజంగా ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే సినిమాలలో సీరియస్‌గా చూపిస్తారు. అయితే శరత్ కుమార్ నటన ఆ క్యారెక్టర్‌ను ఫన్నీగా మార్చింది. అవసరమైన చోట సీరియస్ గా కనిపించారు కూడా! పాత్ర తాలూకు ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులు ఫీలయ్యారంటే అందుకు కారణం శరత్ కుమార్ నటనే అని చెప్పాలి. హృదూ హరూన్ క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంది. సత్య, నేహా శెట్టి స్క్రీన్ స్పేస్ తక్కువ. వాళ్ళిద్దరూ తమ తమ పాత్రలలో చక్కగా నటించారు. మరోసారి హీరో తల్లిగా రోహిణి కనిపించారు. పాత్రకు అవసరమైన రీతిలో హుందాగా ఆవిడ నటన ఉంది.
'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో. అందులో మరో డౌట్ లేదు. మమితా బైజు వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ స్క్రీన్ మీద ఉన్నా... ప్రేక్షకుల చూపు మాత్రం ప్రదీప్ రంగనాథన్ మీద నుంచి పక్కకు వెళ్ళదు. ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. నటనతో... ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాలో నిలబెట్టారు. ఆయనకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ 100 శాతం హెల్ప్ అయ్యింది. కొత్తది అని చెప్పలేం గానీ... ఈ జనరేషన్ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ సినిమాలో ఉంది. పరువు హత్యల మీద చిన్నపాటి సందేశం ఇచ్చినప్పటికీ... మధ్యలో బోరింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ... థియేటర్లలో ప్రేక్షకులకు క్లాస్ పీకే సినిమా కాదు. పీఆర్ (ప్రదీప్ రంగనాథన్) ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న సినిమా. స్లో పాయిజన్‌లా ప్రేక్షకుల మనసుల్లోకి ఎక్కేస్తుంది.





















