Fatty Liver Symptoms on Face : ముఖంలో ఈ మార్పులు వస్తున్నాయా? అయితే అవి కాలేయంలో కొవ్వుకి సంకేతాలు కావొచ్చు, జాగ్రత్త
Early Signs of Fatty Liver : కాలేయంలో కొవ్వు పేరుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య అంటారు. అయితే దీని లక్షణాలు ప్రారంభంలో కనిపించవు కానీ.. ముఖంలో కొన్ని మార్పులను కలిగిస్తాయట. అవేంటంటే..

Liver Health Warning Signs on Face : కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మొదలైనప్పుడు.. ఈ పనులకు ఆటంకం కలుగుతుంది. దీనినే ఫ్యాటీ లివర్ సమస్య (Fatty Liver Disease) అంటారు. ఈ సమస్య ప్రారంభంలో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ప్రారంభ దశలో ప్రత్యేక లక్షణాలు ఏవి కనిపించవు. అందుకే ఈ సమస్య తీవ్రంగా మారేవరకు గుర్తించలేరు. అందువల్ల వ్యాధి పెరుగుతుంది. పరిస్థితి విషమిస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్యాటీ లివర్ ప్రారంభంలో లక్షణాలు చూపించకపోయినా.. ముఖంలో కొన్ని మార్పులు చూపిస్తుందట. కాలేయ సమస్య ఉన్నప్పుడు ముఖం, చర్మం ద్వారా సూచనలు మొదలవుతాయట. అంటే మీరు మీ ముఖం, చర్మంలో కొన్ని ప్రత్యేక మార్పులు చూస్తారు. ఆ మార్పులు కాలేయం అసమతుల్యతకు హెచ్చరికలు కావచ్చని చెప్తున్నారు నిపుణులు. మరి చర్మం ఇచ్చే సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కళ్లు రంగు మారడం..
కళ్లలోని తెల్లటి భాగం కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది. ఈ లక్షణం గుర్తిస్తే అస్సలు విస్మరించవద్దు. ఇది కాలేయ సమస్యకు మొదటి సంకేతం కావచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో బిలిరుబిన్ అనే పదార్ధం పెరుగుతుంది. దీనివల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి. కొన్నిసార్లు ఈ పసుపు రంగు చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి ప్రజలు దీనిని సాధారణ అలసటగా భావించి విస్మరిస్తారు.
పెదవుల రంగులో మార్పు
మీ పెదవులు మునుపటిలా గులాబీ రంగులో లేకుండా.. లేత లేదా నీలం రంగులో కనిపిస్తే.. అది కూడా కాలేయం బలహీనంగా ఉండటానికి సంకేతం కావచ్చు. కాలేయం శరీరంలో ఆక్సిజన్, రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఇది సమతుల్యత కోల్పోయినప్పుడు.. ఈ మార్పు పెదవులపై స్పష్టంగా కనిపిస్తుంది.
ముఖం లేదా కళ్ల కింద వాపు
మీ కళ్ల కింద లేదా బుగ్గలపై అకస్మాత్తుగా వాపు రావడం మీరు చూస్తున్నట్లయితే.. దానిని నిద్ర లేకపోవడం లేదా అలసటగా భావించవచ్చు. ఇది చాలామందికి ఉండే సమస్యే కావచ్చు. కానీ ఇది ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతం కూడా కావచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో నీటి నిలుపుదల సమస్య పెరుగుతుంది. దీనివల్ల ముఖం ఉబ్బినట్లు లేదా వాపుగా కనిపిస్తుంది.
ముఖం రంగు మారడం
మీ ముఖం మునుపటి కంటే పసుపు లేదా నిర్జీవంగా మారడం ప్రారంభిస్తే.. ఇది కాలేయానికి సంబంధించిన హెచ్చరిక సంకేతం కావచ్చు. కాలేయం శుభ్రపరిచే ప్రక్రియ బలహీనంగా ఉన్నప్పుడు.. రక్తంలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీనివల్ల చర్మం మెరిసే బదులు పేలవంగా మారుతుంది. కొన్నిసార్లు ఈ పసుపు రంగు నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి సమయానికి గుర్తించడం చాలా ముఖ్యం.
చర్మం జిడ్డుగా మారడం
మీ చర్మం అకస్మాత్తుగా చాలా జిడ్డుగా మారుతుంది. లేదా మచ్చలు, మొటిమలు పెరగడంతో పాటు.. తగ్గినవి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. మీ కాలేయం శరీరంలో ఉన్న టాక్సిన్‌లను సరిగ్గా తొలగించలేకపోతుందనడానికి ఇది కూడా ఒక సంకేతం. శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ టాక్సిన్స్ పేరుకుపోయినప్పుడు దాని ప్రభావం మొదట చర్మంపై కనిపిస్తుంది. చర్మం జిడ్డుగా, నిర్జీవంగా, మొటిమలతో నిండి పోతుంది.
ముఖంలో, చర్మంపై ఈ తరహా లక్షణాలు కనిపిస్తే సాధారణమే అనుకుని విస్మరించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కాలేయ సమస్యలు ఎంత ఆలస్యం చేస్తే ప్రమాదం అంత ఎక్కువ పెరుగుతుందని.. కాబట్టి వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవాలని అంటున్నారు.






















