World Spine Day 2025 : వెన్నునొప్పిని తేలిగ్గా తీసుకోకండి.. ప్రాణాంతకం కావచ్చు, లిగ్మెంట్ల డ్యామేజ్ నుంచి స్ట్రోక్ వరకు
Back Pain Awareness : మారుతున్న జీవనశైలి, ఒత్తిడి కారణంగా నడుము, మెడ నొప్పి సర్వసాధారణం. ఈ సమస్యపై అవగాహన కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వెన్నెముక దినోత్సవం నిర్వహిస్తున్నారు.

Hidden Dangers Behind Common Back Pain : వెన్నునొప్పి అనేది చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రధాన సమస్య. సమస్య రాకుండా, వచ్చిన వెన్నునొప్పిని దూరం చేసే విధంగా అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ వెన్నెముక దినోత్సవం (World Spine Day 2025 ) నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డే రోజున వెన్నెముక, వీపు ఆరోగ్యంపై అవగాహన (Back Pain Awareness) కల్పిస్తారు. మారుతున్న జీవనశైలి, ఎక్కువ సమయం కూర్చొని పని చేయడం, నిరంతర ఒత్తిడి కారణంగా.. వెన్నునొప్పి, మెడ నొప్పి అనేవి సాధారణ సమస్యలుగా మారాయి. చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావిస్తారు.. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు అంటున్నారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా రావచ్చు అంటున్నారు. మరి సాధారణంగా కనిపించే వెన్నునొప్పి ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లిగ్మెంట్లు దెబ్బతింటాయట
వెన్నునొప్పి అనేది వెన్నెముకకు ప్రమాదకరంగా మారవచ్చు. దీనివల్ల తీవ్రమైన లేదా అకస్మాత్తుగా నొప్పి వస్తుంది. వెన్నునొప్పి తేలికపాటి లేదా లాగినట్లు కాకుండా.. ఒక్కసారిగా తీవ్రంగా వస్తే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ సమయంలో కండరాలు, లిగ్మెంట్లు దెబ్బతినడం లేదా శరీరంలోని అవయవాలలో సమస్యకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో వెన్నునొప్పిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలని సూచిస్తున్నారు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి అంటున్నారు.
స్ట్రోక్‌కి సంకేతం
కొన్ని సందర్భాల్లో వెన్నునొప్పి కాలు లేదా తుంటి వరకు వ్యాపిస్తుంది. దీనిని రేడియేటింగ్ నొప్పి అంటారు. ఇది శరీరంలోని నరాలపై ఒత్తిడి కారణంగా వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. ఇది కూడా తీవ్రమైన వెన్నెముక సమస్యగా మారవచ్చు. అలాగే కాళ్లల్లో అకస్మాత్తుగా బలహీనతగా అనిపిస్తుంది. సయాటికా లేదా స్పైనల్ స్టెనోసిస్ వంటి పరిస్థితుల కారణంగా వెన్నెముకలోని నరాలు నొక్కుకుపోతాయి. దీనివల్ల అవయవాలలో బలహీనత ఏర్పడవచ్చు. ఈ బలహీనత కొన్నిసార్లు స్ట్రోక్‌కి సంకేతం కూడా కావచ్చని చెప్తున్నారు. ఆ సమయంలో కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి.
మూత్రంపై నియంత్రణ కోల్పోతారు
వెన్నునొప్పితో పాటు.. మలవిసర్జన లేదా మూత్రంపై నియంత్రణ కోల్పోవడం తీవ్రమైన నరాల ఒత్తిడి లేదా వెన్నెముకలో ఇన్ఫెక్షన్, డిస్కిటిస్ లేదా మెనింజైటిస్ వంటి వాటికి సంకేతం కావచ్చని చెప్తున్నారు. తుంటి, జననేంద్రియాలలో తిమ్మిరిని సాడిల్ అనస్థీషియా అంటారు. ఇది కూడా తీవ్రమైన వెన్నెముక లేదా నరాల సమస్యకు సంకేతమని అంటున్నారు.
వెన్ను నొప్పి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెన్నెముక, వీపును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి అంటున్నారు. ఎక్కువ సమయం డెస్క్ వద్ద కూర్చొని పని చేస్తే.. కూర్చోవడానికి సరైన భంగిమను ఫాలో అవ్వాలి అంటున్నారు. అలాగే ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉండకండి. దీనితో పాటు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు, స్ట్రెచింగ్ చేయాలి. అదే సమయంలో డెస్క్ పని చేసే వారి ప్రతి గంటకు ఓ సారి లేచి నిలబడి.. కాసేపు నడవాలి. బరువు తగ్గించుకోవడం, ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వీటి అన్నింటిని ఫాలో అయితే వెన్నెముకపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.






















