Saffron: కుంకుమ పూవు ఎందుకంత ఖరీదు? దీన్ని తింటే పిల్లలు తెల్లగా పుడతారన్నది ఎంతవరకు నిజం?
Saffron: కుంకుమ పూవు ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీని చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి.
Saffron: గర్భిణులకు ఎంతో మంది కుంకుమ పూవు రేకలను బహుమతిగా ఇస్తుంటారు. ఎందుకంటే ఈ రేకలను పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతారన్నది పూర్వం నుంచి ఉన్న నమ్మకం. ఇందులో నిజమెంతో తెలియకుండానే చాలా మంది ఈ నమ్మకాన్నే ఫాలో అయిపోతున్నారు. అసలు ఈ పూరేకులు ఎందుకంత ఖరీదో, వీటిని తినడం వల్ల రంగుపై చూపే ప్రభావం ఎంతో తెలుసుకుందాం.
ఎందుకంత ఖరీదు
ఎక్కడ పడితే అక్కడ కుంకుమ పూల మొక్కలు పెరగవు. ఇది కాశ్మీర్లోని పాంపోర్ అనే చిన్న పట్టణంలోనే అధికంగా పెరుగుతంది. అది కూడా కేవలం శరదృతువు కాలంలోనే. అది కూడా ఒక పువ్వులో కేవలం మూడు రేకలు మాత్రమే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఏరి వాటి రంగు, రుచిని కాపాడేందుకు ఎండ బెడతారు. అరకిలో కుంకుమ పూల రేకలు కావాలంటే కనీసం 75 వేల పూవులు అవసరం అవుతాయి. అందుకే కుంకుమ పూలు చాలా ఖరీదు. కుంకుమ పూలలో కూడా పుషల్, సర్గోల్, సూపర్ నెగిన్, నెగిన్ అనే నాలుగు రకాలు ఉన్నాయి. వీటిలో చవకైనది పుషల్ రకం. ఇది పసుపు, నారింజ రంగును కలిగి ఉంటుంది. దీనిలో ఔషధగుణాలు కూడా చాలా తక్కువ. ఇక అత్యంత ఖరీదైనది సూపర్ నెగిన్ రకం. ఇందులో ఔషధ విలువలు అధికం.
రంగును ప్రభావితం చేస్తుందా?
గర్భిణిలు కుంకుమ పూరేకులు తింటే పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉంటుందని అంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు కుంకుమ పూరేకులు తినడం మంచిదే. ఇందులోని ఔషధ గుణాలు కాబోయే తల్లికి, గర్భస్థ శిశువుకు చాలా అవసరం. కానీ ఇది రంగును నిర్ణయిస్తుందని మాత్రం శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. బిడ్డ రంగును నిర్ణయించేవి తల్లి, తండ్రి నుంచి వచ్చిన జన్యువులే. అయితే గర్భిణులు కుంకుమ పూల రేకలు తినడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది తల్లి శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేస్తుంది. అలాగే జలుబు, దగ్గును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలైతే కుంకుమ రేకలతో చాలా ఉన్నాయి. కానీ బిడ్డ రంగును పెంచుతుందని మాత్రం ఇంతవరకు ఏ పరిశోధనా నిరూపించలేదుజ
కల్తీది కనిపెట్టండిలా
కల్తీ కుంకుమ పూలతో చాలా సమస్యలు వస్తాయి. మీరు కొన్న కుంకుమ పువ్వు మంచిదో, కల్తీదో తెలుసుకోవాలంటే మూడు రేకలను గ్లాసు నీటిలో వేయండి. కుంకుమ పువ్వు కరిగిపోకుండా అలాగే ఉంటే అది మంచిదని అర్థం. కరిగిపోతే మాత్రం కాదు. అలాగే కల్తీ కుంకుమపువ్వు నీటిలో వేసిన వెంటనే రంగుని విడిచి కరిగిపోతుంది. కానీ మంచి కుంకుమపువ్వు నీటిలో వేసిన వెంటనే రంగును విడవదు. కొన్ని సెకన్ల సమయాన్ని తీసుకుని అప్పుడు రంగును విడుదల చేస్తుంది.
కుంకుమ పువ్వు మంచిదే కదా అని రోజూ ఎంత పడిత అంత తినకూడదు. చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయి. రోజుకు 1.5 గ్రాముల కుంకుమ పూరేకలు తింటే చాలు. అయిదు గ్రాముల కన్నా ఎక్కువ తింటే మాత్రమమే చాలా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. గర్భిణిలుకు అయితే గర్భస్రావం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also read: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే, కష్టసమయంలో తింటే ఎంతో ఫలితం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.