Flu Shot in Winter : చలికాలంలో ఫ్లూ టీకా ఎందుకు అవసరం? WHO ఇస్తోన్న సూచనలు ఇవే
Winter Health : ఫ్లూ టీకా వేయించుకోకపోతే ప్రమాదమని చెప్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది తీవ్రమైన అనారోగ్యం, ఇతరులకు ముప్పును పెంచుతుందని చెప్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో చూసేద్దాం.

Flu Shot : చలికాలాన్ని ఫ్లూ సీజన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయంలో చాలామంది ఫ్లూ బారిన పడతారు. అందుకే ఫ్లూ షాట్ (Vaccine for Flu) తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే కొందరు ఆరోగ్యంగా ఉన్నామని లేదా అరుదుగా అనారోగ్యానికి గురవుతామని భావించినప్పటికీ.. ఫ్లూ టీకా తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన పరిణామాలు వస్తాయని చెప్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల మీకే కాదు.. మీ చుట్టూ ఉన్నవారికి కూడా మంచిదని చెప్తున్నారు. మరి ఈ సమయంలో ఫ్లూ షాట్ తీసుకోవచ్చా? నిజంగా ఇది అవసరమా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. సీజనల్ ఇన్ఫ్లుఎంజా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 మిలియన్ల మందిలో తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుంది. అలాగే 6,50,000 మరణాలకు దారి తీస్తుంది. భారతదేశంలో ఫ్లూ ప్రతి సంవత్సరం దాదాపు 5-10% మంది పెద్దలను, 20-30% మంది పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది జలుబులా మాత్రమే కాకుండా.. ఫ్లూ న్యుమోనియా, గుండెపోటు, స్ట్రోక్స్, ఆసుపత్రిలో చేరడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని ఇది ప్రభావితం చేస్తున్నట్లు తెలిపింది.
ఎక్కువ ప్రమాదం వారికే..
ఫ్లూ టీకాను WHO సిఫార్సు చేస్తోంది. ఇన్ఫ్లుఎంజా, దాని తీవ్రమైన పరిణామాలను నివారించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా దీనిని చెప్తారు. ఫ్లూ టీకా తీసుకోకపోతే వైరస్ సోకే ప్రమాదం 40 - 60% వరకు పెరుగుతుంది. అధిక జ్వరం, శరీర నొప్పులు, చలి, దగ్గు, అలసట వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి న్యుమోనియాకు దారి తీస్తుంది. లేదా ఆసుపత్రిలో చేరేలా చేస్తుంది. వృద్ధులు (65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ), చిన్న పిల్లలు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం లేదా గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఫ్లూ టీకా ఎలా పనిచేస్తుందంటే
ఫ్లూ టీకా ముందుగానే మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బలహీనమైన లేదా వైరస్ల నుంచి మీ శరీరాన్ని రక్షించడానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది కచ్చితంగా 100% ప్రభావవంతంగా లేనప్పటికీ.. టీకాలు వేయించుకున్న వ్యక్తులు తీవ్రమైన అనారోగ్యాల బారిన తక్కువ పడతారని అధ్యయనాలు చెెప్తున్నాయి. మీకు ఫ్లూ వచ్చినా.. సాధారణంగా లక్షణాలు తక్కువగా ఉంటాయి. క్రమంగా వైరస్ పురోగతిని తగ్గిస్తుంది.
అలాంటివారికి మరణ ప్రమాదం ఎక్కువ..
క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఉన్న రోగులు సాధారణంగా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది. కొంతమంది రోగులు ఫ్లూతో ఆసుపత్రిలో చేరడం, అధిక మరణాలు, మూత్రపిండాల పనితీరు క్షీణించడంతో ముడిపడి ఉంటాయి. కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ రోగులు లేదా అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. CKD రోగులలో తేలికపాటి ఫ్లూ ఇన్ఫెక్షన్ తీవ్రతరం కావచ్చు. ఆసుపత్రిలో చేరడానికి లేదా తీవ్రమైన పరిస్థితులలో, మరణానికి దారి తీస్తుంది.
అపోహలు వదిలేయండి
కొంతమంది ఫ్లూ టీకా ఫ్లూకి కారణమవుతుందని భయపడతారు. కాబట్టి వారు దానిని తీసుకోరు. కానీ ఇది అబద్ధం. టీకాలో క్రియారహిత వైరస్లు లేదా అంటువ్యాధి లేని పదార్థాలు ఉన్నందున మీరు టీకా నుంచి ఫ్లూ బారిన పడలేరు. ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి లేదా తక్కువ జ్వరం వంటి దుష్ప్రభావాలు సాధారణమైనవి. త్వరగా తగ్గిపోతాయి. కొంతమందికి ఫ్లూ రాకపోతే.. వారికి టీకా అవసరం లేదని భావిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు వైద్యుల సలహాతో ఫ్లూ టీకా తీసుకుంటే మంచిది.






















