WhatsApp Safety Tips : వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఆ తప్పులు చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి
WhatsApp Blackmail : డిజిటల్ అరెస్ట్.. వాట్సాప్లో బ్లాక్ మెయిల్ చేయడం వంటి సైబర్ కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అయితే మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్లో ఇబ్బంది పెడుతుంటే ఈ చర్యలు తీసుకోండి.

WhatsApp Scams and Blackmail : ఇటీవల డిజిటల్ సాంకేతికత ద్వారా చాలామంది కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. అభివృద్ధి చెందుతున్నారు. అదే సమయంలో సాంకేతికతను ఉపయోగించి దానిని దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వాటిలో వాట్సాప్ బ్లాక్‌మెయిల్ కూడా ఒకటి. ఈ డిజిటల్ యుగంలో.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా మెసేజ్ చేయాలనుకున్నా.. డాక్యుమెంట్స్ షేర్ చేయాలన్నా, ఆడియో, వీడియో కాల్స్ WhatsApp ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా WhatsAppని చెడు పనుల కోసం కూడా ఉపయోగించేవారు కూడా ఉన్నారు.
కొంతకాలంగా ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. WhatsAppలో బ్లాక్‌మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేయడం వంటి కేసులు పెరగడంతో దానిపై అవగాహన కల్పించే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భయపడటం కంటే తెలివిగా పని చేయడం చాలా ముఖ్యం. WhatsAppలో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తే మీరు ఏమి చేయాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మీరు సేఫ్‌గా ఉండగలుగుతారో చూసేద్దాం.
రిపోర్ట్ చేసి.. ఫిర్యాదు చేయండి
WhatsAppలో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే.. భయపడాల్సిన అవసరం లేదు. అతను లేదా ఆమె మిమ్మల్ని ఏదైనా ఫోటో లేదా వీడియో చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తుంటే.. ఆ వస్తువులను సేవ్ చేయండి. బ్లాక్‌మెయిలర్ చెప్పేదేమీ వినవద్దు. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి. బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన అన్ని చాట్‌లు, ఆడియోలు, స్క్రీన్‌షాట్‌లు, నంబర్‌లను సురక్షితంగా ఉంచండి. ఇవన్నీ తరువాత మీ భద్రత కోసం ఉపయోగపడతాయి.
అతను లేదా ఆమె ఏదైనా ఫోటో లేదా వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తే.. వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930ని సంప్రదించండి. మీరు మీ నగరంలోని సైబర్ సెల్‌లో ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ బృందాలు ప్రతిరోజూ ఇలాంటి కేసులపై వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే మీరు వారికి సరైన సమాచారాన్ని అందించాలి. అలాగే మిమ్మల్ని బెదిరిస్తున్న వారికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డేటా సైబర్ సెల్ వారికి షేర్ చేయాలి.
సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు
బ్లాక్‌మెయిలింగ్ కేసుల్లో చాలామంది ఇతరులతో తమ సమస్యను షేర్ చేసుకోవడానికి భయపడతారు. పరిస్థితి విషమిస్తున్న ఎవరికీ చెప్పరు. కానీ మీకు నమ్మదగిన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడికి ఈ విషయం చెప్పండి. అలా చెప్పకపోతే మీరు ఎప్పటికీ ఆ బెదిరింపుల నుంచి బయటకు రాలేరు. అలాగే ఆ సమయంలో మీ బ్రైయిన్ అంత పనిచేయకపోవచ్చు.. మీరు షేర్ చేసుకున్న వ్యక్తి మీకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. కాబట్టి సహాయం తీసుకునేందుకు ఎప్పుడూ వెనకాడకండి.
బ్లాక్‌మెయిలింగ్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు.. బ్లాక్‌మెయిలర్‌కు భయపడి తప్పుడు చర్యలు తీసుకుంటారు. అందుకే అటువంటి పరిస్థితిలో మీ స్నేహితుడికి లేదా బంధువుకు ఈ పరిస్థితి గురించి తెలియజేయండి. వీటితో మీరు మీ ఫోన్‌లో కొన్ని భద్రతా సెట్టింగ్‌లను కూడా ఆన్ చేసుకోవాలి. దీనివల్ల మీ ఫోన్ డేటాను అవతలి వాళ్లు దుర్వినియోగం చేయలేరు. వెంటనే సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి పూర్తి సమాచారం ఇవ్వండి.






















