Fools Day: ఫూల్స్ డే చరిత్ర ఏమిటి? ఏప్రిల్ 1నే ఎందుకు జరుపుతారు?
April 1st fools day: ఏప్రిల్ 1వ తేదీని చాలా మంది ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. కానీ ఈ సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చింది?
అదిగో.. మీ వెనక ఏదో ఉన్నట్టుంది ఒకసారి చూసుకోండి ..ఏప్రిల్ ఫూల్!! ఏప్రిల్ 1 రోజున ఇలాంటి ఆట పట్టింపులు ఎక్కడ చూసినా జరుగుతుంటాయి. ఏప్రిల్ 1 వ తేదీని చాలా మంది ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఇళ్లలో, స్కూళ్లలో, ఆఫీసుల్లో ఒక్కచోటని కాదు..ఫూల్స్ డే సెలబ్రేషన్స్ అన్ని చోట్ల సరదా సరదాగా జరుగుతాయి. టెలివిజన్ ప్రోగ్రామ్‌లలో కూడా ఉల్లాసభరితమైన చిలిపి ఆటలు చూస్తూనే ఉంటాం. కానీ ఈ సంప్రదాయం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఏప్రిల్ 1 నే ఎందుకు జరుపుతారు? దీని గురించి ప్రాచీన రోమన్ల చరిత్రల్లో కొన్ని మూలాలు కనపడుతున్నాయి.
ప్రాచీన రోమన్లు మార్చి 25న హిలేరియా అనే ఒక వేడుకను జరుపుకొనేవారు. సైబెల్ అనే ప్రకృతి, సంతానోత్పత్తికి సంబంధించిన ఒక ఫ్రిజియన్ దేవతని పూజించుకోవటానికి ఏప్రిల్ 1 ప్రత్యేకమైన రోజు. ఈ సైబెల్ దేవత చుట్టూ ఎన్నో విచిత్రమైన్ కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సైబెల్ దేవతకు ముడిపడి ఉన్న కథనాల్లో భాగంగానే ఫూల్స్ డే పుట్టిందని చాలామంది భావిస్తారు. వారు సరిగ్గా ఏప్రిల్ 1వ తేదీన వెనెరాలియాస్ అనే మరొక పండుగను కూడా జరిపేవారు. ఇది వీనస్ వెటికోర్డియా అనే ప్రేమకు చిహ్నమైన రోమన్ల దేవతకు అంకితం ఇచ్చారు.
1983లో అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన ఒక కథనం ప్రకారం, ఏప్రిల్ ఫూల్స్ డే కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తితో ముడిపడి ఉంది. ఆ కథలో వివరించినట్లుగా, తమలో ఒకరిని ఒకరోజు రాజుగా చేయమని రాజును అక్కడి బృందం కోరుతుంది. ఏప్రిల్ 1న కుగెల్ అనే వ్యక్తికి రాయల్ ఆర్డర్ ఇస్తారు. ఆ రోజున సిల్లీ గా, హాస్యాస్పదంగా ప్రవర్తించాలని రూల్ కూడా పెడుతాడు. అయితే, ఈ కథ అసలు జరగనే లేదు. ఇది నిజానికి అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ ఫ్రెడ్ బేల్స్‌ను ఆట పట్టించటానికి బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసెఫ్ బోస్కిన్ రాసిన ఏప్రిల్ ఫూల్స్ డే ప్రాంక్ అని తేలింది.
అవన్నీ నిజమని మీరూ నమ్మేసారు కదూ! ఏది ఏమైనప్పటికీ, ఏప్రిల్ ఫూల్స్ డేకి సంబంధించిన నిజమైన ప్రస్తావన 1561లో ఏప్రిల్ 1వ తేదీన ప్రచురించబడిన ఫ్లెమిష్ కామిక్ రచయిత ఎడ్వార్డ్ డి డెనేచే రాసిన ఎర్రాండ్స్ అనే పోయెం లో అసలైన ఏప్రిల్ ఫూల్స్ డే గుట్టు దాగి ఉంది. ఈ పద్యంలో ఒక సేవకునికి యజమాని అనవసరమైన పనుల లిస్ట్ ఇచ్చి పంపిస్తాడు. అసలు భూమ్మీద ఉనికిలో లేని వస్తువుల, పనుల చిట్టా అది. అదంతా ఒక ప్రాంక్ అని సేవకుడు తెలుసుకుంటాడు. ఇది ఏప్రిల్ 1వ తేదీన రాసినది కాబట్టి సిల్లీ పనులు చేసే ఒక ప్రాంక్ లాంటి కాన్సెప్ట్ తో లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడమనే ఈ ఆట ఎన్నో యేళ్లుగా జనాదరణ పొంది ఇలాగే కొనసాగుతోంది. ఇది మనమూ మన మిత్రుల మీద కుటుంబ సభ్యుల మీద ఇప్పటికీ ప్రయోగిస్తున్నాం. ఇదీ నమ్మేసారా? ఇది నిజమేలెండి.